కమల్ ఈస్ కమాల్...
- May 30, 2015
సినిమా వాళ్లకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అని ఆశ్చర్యపోకండి! చాలా కాలం తరువాత తెలుగులో నేరుగా సినిమా (పేరు 'చీకటి రాజ్యం') చేస్తూ, ఆ షూటింగ్ కోసం భాగ్యనగరికి వచ్చిన నటుడు కమల్‌హాసన్ మాటల్లో అచ్చంగా సెంటిమెంట్, తనను ఇంతవాణ్ణి చేసిన దర్శక గురువు స్వర్గీయ కె. బాలచందర్ పట్ల అపారమైన భక్తి కనిపించాయి. కొద్దినెలల క్రితం మరణించిన బాలచందర్‌ను ఈ 'విశ్వనటుడు' గుర్తుచేసుకుంటూ, భౌతికంగా దూరమైనా అలాంటి పెద్దలు చూపిన ప్రభావం అలాగే ఉండిపోతుందన్నారు. ''నా అలవాట్లు, నా కోపం, నా నటన దగ్గర నుంచి రచన దాకా అన్నీ నేను కె.బి. సార్ నుంచి, ఆయన సహాయకులైన అనంతు గారి దగ్గర నుంచి నేర్చుకున్నవే'' అని వినయంగా ఒప్పుకున్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సినిమాలు చేసి, కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న కమల్ మాత్రం ఈ 50 ఏళ్ళ పైచిలుకు కెరీర్లో కె.బి. దర్శకత్వంలో తాను పనిచేసిన 36 సినిమాలే తన అసలైన స్కోర్ అనడం విశేషం. ''ఇటీవలి 'ఉత్తమ విలన్'లో మేమిద్దరం కలసి పనిచేసిన 37వ చిత్రం. నా కెరీర్లో నేను సాధించిన పెద్ద విజయం ఇదే'' అన్నారాయన. తన లాగానే కె.బి. ద్వారా పైకొచ్చిన తరువాతి తరం శిష్యుడు ప్రకాశ్‌రాజ్‌ను ప్రస్తావిస్తూ, ''కె.బి. భౌతికంగా లేరని బాధపడుతున్న ప్రకాశ్‌కు ఒక పెద్దన్న లాగా పక్కన ఉంటానని చెప్పా'' అని ప్రకటించారు. వేదికపై కమల్ ఈ మాటలు చెబుతున్నప్పుడు కిందనున్న ప్రకాశ్‌రాజ్ కళ్ళలో తడి, ఎప్పుడూ ప్రెస్‌మీట్స్‌కి పెద్దగా రాని త్రిష ముఖంలో అబ్బురం కనిపించాయి. విద్య నేర్పిన గురువు మీద, ప్రతిభావంతుడైన సీనియర్ సహచరుడి మీద అసలు సిసలు గురుభక్తి అంటే బహుశా ఇదేనేమో!
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









