రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలి: టి.గవర్నర్

- April 23, 2021 , by Maagulf
రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలి: టి.గవర్నర్

హైదరాబాద్: కోవిడ్ నివారణ పద్ధతులపై, వ్యాక్సినేషన్ పై మరింత అవగాహన పెంచడానికి జాతీయ సేవా పథకం, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్  లకు సూచించారు.

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఈరోజు గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంలో, ప్రజలలో మంచి అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తెలిపారు.


ప్రజలు సరైన విధంగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం, గుంపులుగా  గుమికూడకుండా ఉండటం ఇలాంటివి కోవిడ్ నివారణ, నియంత్రణలో అత్యంత కీలకమని డాక్టర్ తమిళి సై స్పష్టం చేశారు.ప్రజా చైతన్యంతోనే కోవిడ్ లాంటి మహమ్మారిని నిరోధించగలమని, ప్రజల ప్రాణాలను కాపాడగలమని ఆమె అన్నారు.ప్రతి విశ్వవిద్యాలయంలోని ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల  సేవలను ఈ దిశగా తగు జాగ్రత్తలతో వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు.
మనము ఎన్ని వెంటిలేటర్లు తయారుచేసిన, ఎన్ని మంచి మందులు తయారుచేసిన, ఆక్సిజన్ సప్లై  పెంచినప్పటికీ చైతన్యవంతమైన ప్రజలే సరైన ముందు జాగ్రత్తలతో  కోవిడ్ నివారించ గలరని డాక్టర్ తమిళిసై వివరించారు.


కోవిడ్ బారిన పడుతున్న వారిలో దాదాపు 40 శాతం మంది యువకులే ఉండడం బాధను కలిగిస్తుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.వైస్ ఛాన్సలర్ లు తమ తమ యూనివర్సిటీలలోని విద్యార్థులతో, వాలంటీర్లతో సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల ద్వారా మంచి చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాలని, వినూత్న పద్ధతులు అవలంబించేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
ప్రతి విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని , ఈ దిశగా  అధికారులు అందరూ శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
వచ్చే నెల ఒకటవ తారీఖు నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్న దృష్ట్యా అర్హులైన అందరు విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలి అని  డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా గవర్నర్ విశ్వవిద్యాలయాలలో ఆన్ లైన్  క్లాసులు, ఆన్ లైన్ పరీక్షలు జరుగుతున్న తీరుపై సమీక్షించారు.ప్రతి విశ్వవిద్యాలయంలో  ఆన్  లైన్ క్లాసులు అందుకోలేకపోయిన విద్యార్థుల కోసం డిజిటల్ రిసోర్సెస్ సిద్ధం చేయాలని సూచించారు.
ఇదే సందర్భంగా ప్రతి విశ్వవిద్యాలయము తమ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ రూపొందించడంతో పాటు, వారిని చాన్సలర్ కనెక్ట్స్   అల్యూమ్నై  నెట్వర్క్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ప్రభుత్వం తరఫున  విద్యాసంస్థలలో చేపట్టిన   కోవిడ్ నియంత్రణా చర్యలు,ఆన్ లైన్ విధానం విద్యా బోధన సంబంధిత చర్యలను వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్, బి. జనార్దన్ రెడ్డి, నీతూకుమారి ప్రసాద్,  వికాస్ రాజ్,  రాహుల్ బొజ్జ తదితరులతోపాటు కాలేజియేట్ ఎడ్యుకేషన్  కమిషనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.సెక్రటరీ టు గవర్నర్ కె.సురేంద్రమోహన్, రాజ్ భవన్ నుండి ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com