ఢిల్లీ లో మారణహోమం..ప్రతి గంటకు 12 మంది మృతి..

- April 25, 2021 , by Maagulf
ఢిల్లీ లో మారణహోమం..ప్రతి గంటకు 12 మంది మృతి..

ఢిల్లీలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ కాటుకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఢిల్లీలో ఎటు చూసినా అంబులెన్స్‌ల సైరన్‌లే వినిపిస్తున్నాయి. శవాలతో శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. ఆరని చితి మంటలతో ఢిల్లీ తగులబడుతోంది. గత వారం డేటా ప్రకారం ఢిల్లీలో ప్రతి గంటకు 12 మంది కరోనా రోగులు మరణిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక.. ఆక్సీజన్ దొరక్క.. ప్రాణాలు వదులుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సోమవారం నుంచి శనివారం (ఏప్రిల్ 19 నుంచి 24) వరకు ఢిల్లీలో 1,777 మంది మరణించారు. ఈ లెక్కన గంటకు 12 మంది మరణించారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చన అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

గత వారం (ఏప్రిల్ 12 నుంచి 17) ఢిల్లీలో 677 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అప్పుడు సగటున గంటకు ఐదుగురు మరణించారు. ఈ వారం మాత్రం గంటకు సగటున 10కి పైగా మరణాలు నమోదయ్యాయి. సోమవారం ఢిల్లీలో 240 మంది మరణించారు. అంటే గంటకు 10 మంది చనిపోయారన్న మాట. ఇక మంగళవారం 277 మంది మరణించారు. గంటకు సగటున 12 మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా ఆక్సీజన్ కొరత వల్ల ఢిల్లీలో భారీగా మరణాలు నమోదవుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో పదుల సంఖ్యలో రోగులు చనిపోతున్నారు. శుక్రవారం రాత్రి జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక రాత్రికి రాత్రే 20 మంది రోగులు మరణించారు. ఇదొక్కటే కాదు ఢిల్లీలో చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం 24,103 మందికి కరోనా నిర్ధారణ అయింది. 22,695 మంది కోలుకోగా.. మరో 357 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 10 లక్షల 4వేల 782 కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 లక్షల 97వేల 804 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 13,898 మంది మరణించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 93,080 యాక్టివ్ కేసులున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com