అంతరిక్షంలోకి వెళ్తున్న తెలుగమ్మాయి

- July 02, 2021 , by Maagulf
అంతరిక్షంలోకి వెళ్తున్న తెలుగమ్మాయి

అమెరికా: రోదసి పర్యటనలపై అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తో వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్ పోటీ పడుతున్నారు.అంతరిక్ష ప్రయాణానికి కాలంతో పరుగులు తీస్తున్నారు.జులై 11న మరోసారి అంతరిక్షంలోకి పయనం కాబోతున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ప్రయాణమయ్యే బృంద సభ్యుల వివరాలను వెల్లడించారు.అందులో ఓ తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉండడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. దీంతో అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మూలాలున్న అమ్మాయిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.ఆమె వర్జిన్ గెలాక్టిక్ లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. కాగా,అంతకుముందు భారత్ మూలాలున్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లు అంతరిక్షంలో అడుగు పెట్టారు.

అంతరిక్షం అందరికోసమని, దానిని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ ప్రయాణాన్ని పెట్టుకున్నామని రిచర్డ్ బ్రాన్సన్ చెప్పారు. జులై 11న మొదలయ్యే ఈ ప్రయాణంలో తాను సహా 8 మంది అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు ఆయన చెప్పారు. డేవ్ మెక్ కే , మైకేల్ మశుచి, సీజే స్టర్కో, కెల్లీ లాటిమర్ (ఈ నలుగురు పైలెట్లు), చీఫ్ ఆస్ట్రోనాట్ శిక్షకులు బెథ్ మోజెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్, శిరీష బండ్లలు వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్‘ఫ్లైట్’లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

మేలో తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ).. కమర్షియల్ లాంచ్ లైసెన్స్ ను మంజూరు చేసిందని బ్రాన్సన్ చెప్పారు. అయితే, అంతకన్నా ముందు మరిన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని, వ్యోమగాముల అనుభవాల ఆధారంగా విశ్లేషణ చేస్తామని ఆయన తెలిపారు. అంతరిక్షం అందరిదన్నారు. దాదాపు 17 ఏళ్ల పరిశోధనల తర్వాత దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ నెల 11న జరిగే ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన వెల్లడించారు. తిరిగొచ్చేటప్పుడు మరింత మందికి అవకాశం ఇచ్చే ఓ మంచి విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com