కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత మరింత జాగ్రత్త అవసరం: WHO

- July 07, 2021 , by Maagulf
కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత మరింత జాగ్రత్త అవసరం: WHO

జెనీవా: కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉందని, కాబట్టి అప్రమత్తత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. కరోనా వేళ ఇతర ఇన్ఫెక్షన్లపైనా జాగ్రత్త అవసరమని సూచించింది. మలేరియా, డెంగీ, గన్యా, క్షయ, హెచ్ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వీటి బారినపడిన వారిలోనూ కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి జ్వరంతో బాధపడే వారికి చికిత్స అందించే విషయంలో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కొవిడ్ బాధితుల్లో ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తొలి దశలోనే గుర్తించడం, చికిత్స వంటి వాటిపై మార్గదర్శకాలు జారీ చేసింది.
 
ఇది సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి ఏయే ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయన్న విషయాన్ని బట్టి ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవడం అవసరమని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. కొవిడ్‌తోపాటు ఇతర ఇన్ఫెక్షన్ల బారినపడిన వారికి అవసరమైతే తప్ప యాంటీ బయాటిక్స్ ఇవ్వొద్దని పేర్కొంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారుల్లో సెకండరీ ఇన్ఫెక్షన్ల రూపంలో బ్యాక్టీరియా దాడిచేసే అవకాశం ఉందని, కాబట్టి ఇలాంటి వారికే యాంటీ బయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని గుర్తించినా ఒకే రకమైన ఔషధాలు ఇవ్వకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. లక్షణాలు తగ్గకపోతే కల్చర్ పరీక్ష నిర్వహించడం ద్వారా బ్యాక్టీరియాను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స అందించాలని పేర్కొంది. వారం రోజులకు మించి యాంటీ బయాటిక్స్ వాడొద్దని సూచించింది. సెకండరీ ఇన్ఫెక్షన్లుగా బ్యాక్టీరియానే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com