భాష, సంస్కృతి, సంప్రదాయాలు, మహనీయుల గురించి ముందు తరాలకు తెలియజేయాలి: ఉపరాష్ట్రపతి

- July 13, 2021 , by Maagulf
భాష, సంస్కృతి, సంప్రదాయాలు, మహనీయుల గురించి ముందు తరాలకు తెలియజేయాలి: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: భాష, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రజలకు దిశానిర్దేశం చేసిన మహనీయుల జీవితాల గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. ఈ రోజు హైదరాబాద్ లో పలువురు రచయితలు తమ పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు.
 పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన వివిధ పుస్తకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకు మామిడి హరికృష్ణ ఉపరాష్ట్రపతికి అందజేశారు.పీవీ  దేశానికి చేసిన సేవలను యువతకు తెలియజేసే విధంగా, పరిశోధనాత్మకంగా ఈ పుస్తకాలను ప్రచురించే చొరవ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవ కమిటీకి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఇదే మార్గంలో మరిన్ని పుస్తకాలను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
దక్కను ప్రాంతంలోని ఉర్దూ రచయితల జీవిత విశేషాలను తెలియజేస్తూ, ప్రముఖ పాత్రికేయులు ఇఫ్తేకార్ రచించిన జెమ్స్ ఆఫ్ డక్కన్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఉర్దూ భాషను అమితంగా అభిమానించే వారిలో తానూ ఒకరినన్న ఉపరాష్ట్రపతి, ముందు తరాలకు తెలుసుకోవలసిన విశేషాలతో మంచి పుస్తకాన్ని అందించిన వారికి అభినందనలు తెలిపారు.
శ్రీరాముణ్ని ఆదర్శపురుషునిగా చూపిన 16 గుణాలను రామాయణంలో వివిధ సందర్భాల్లో ఆవిష్కరించిన విధానాన్ని వివరిస్తూ, సత్యకాశీ భార్గవ  రాసిన మానవోత్తమ రామ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి స్వీకరించారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు  ప్రతిబింబంగా, పితృవాక్పరిపాలకుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, సోదరులకు, తనను నమ్మిన వారికి ఆప్యాయతను పంచినవాడిగా, ఆదర్శ పాలకుడిగా మనకు ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడి 16 గుణాలను ఆవిష్కరించిన రచయితను ఉపరాష్ట్రపతి అభినందించారు.
 
గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని, ప్రత్యేకించి నల్గొండ జిల్లా ప్రజల జీవన విధానం నేపథ్యంలో తాను రచించిన నల్గొండ కథలు పుస్తకాన్ని యువరచయిత మల్లికార్జున్ ఉపరాష్ట్రపతికి అందజేశారు. కథలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలన్న ఆయన, ప్రజల జీవన విధానాన్ని, మనసులను పుస్తకంలో ఆవిష్కరించిన రచయితకు అభినందనలు తెలియజేశారు.
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com