తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా ఆ దేశాలు

- September 07, 2021 , by Maagulf
తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా ఆ దేశాలు

కాబూల్: ప్రపంచం మొత్తం ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ గురించే చర్చిస్తోంది. అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. తాజాగా పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకున్నారు. త్వరలో అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ దేశాలు హాజరవుతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఇప్పటికే పాకిస్థాన్‌, చైనా, టర్కీ, కతర్‌, రష్యా, ఇరాన్‌ దేశాలకు తాలిబన్లు ఆహ్వానం పంపారట.

అఫ్గాన్‌లోనే చైనా, పాక్‌ రాయబార అధికారులు

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌ నుంచి చాలా దేశాల రాయబార కార్యాలయ అధికారులు  స్వదేశాలకు వెళ్లిపోయినా చైనా, పాకిస్థాన్‌, రష్యా అధికారులు అక్కడే ఉన్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్లకు ఈ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం దీన్ని బట్టే అర్థం అవుతోంది.

ఇక తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కాబుల్‌లో విలేకరులతో మాట్లాడారు. అఫ్గాన్‌లో యుద్ధం ముగిసిందని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ సర్దుకున్నాయని పేర్కొన్నారు. ఇతరులు తమ దేశాన్ని పునఃనిర్మించలేరనే విషయాన్ని అఫ్గాన్‌ ప్రజలు తెలుసుకోవాలని హితవు పలికారు. అంతేకాదు కతర్‌, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు కాబుల్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాక్‌ మద్ధతుతోనే తాలిబన్లు పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకొన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తాలిబన్లకు మద్దతు ఇచ్చే దేశాలైన పాక్‌, చైనాలు.. అఫ్గానిస్థాన్‌లో  తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ ఏర్పాటుకు అతిథులుగా రానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com