రివ్యూ: లవ్ స్టోరీ

- September 24, 2021 , by Maagulf
రివ్యూ: లవ్ స్టోరీ

చిత్రం: లవ్ స్టోరీ
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని, ఉత్తేజ్ తదితరులు.
సంగీతం: పవన్ సి.హెచ్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
కరోనా పాండమిక్ నేపథ్యంలో సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ గందరగోళం నుండి తేరుకోవడానికి పరిశ్రమ నుండి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కష్టమైనా, సినిమాల్ని ధియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు కొందరు. ఓటీటీ ఊరిస్తోంటే, అటు వైపు వెళ్తున్నారు కొందరు. కొంత డైలమా నడుమ ఓటీటీని కాదనుకుని, నేరుగా ధియేటర్లలోకి వచ్చింది ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల బ్రాండ్ ఈ సినిమాకి క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్. నాగచైతన్య, సాయి పల్లవి కాంబో అదనపు ఆకర్షణ. ఇప్పుడిక ‘లవ్ స్టోరీ’ సంగతేంటో చూద్దాం పదండి.

కథ:
తెలంగాణలోని ఆర్మూర్ అనే ఓ ఊరి నుంచి నగరానికి వచ్చిన ఓ యువకుడు రేవంత్ (నాగ చైతన్య). అతనికి మౌనిక (సాయి పల్లవి) పరిచయమవుతుంది. ఫిట్‌నెస్ డాన్స్ స్టూడియో నడిపే రేవంత్, ఉద్యోగాన్వేషణలో సరైన ఛాన్స్ కోసం ఎదురు చూసే మౌనిక కలుస్తారు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. కానీ, మౌనిక పెద్దింటమ్మాయి. రేవంత్ - మౌనిక ప్రేమకి కులం అడ్డంకిగా మారుతుంది. మరి, ఆ అడ్డుగోడల్ని దాటి ఇద్దరూ ఒక్కటయ్యారా.? లేదా.? అన్నది మిగతా కథ.

కథనం:
శేఖర్ కమ్ముల సినిమాల్లో వేగం కాస్త తక్కువ ఉంటుంది. కానీ, ప్రతి సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. తొలి అర్ధభాగం సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ సినిమా ఎమోషనల్ టోన్‌లోకి వెళుతుంది. కులం అడ్డుగోడలతో పాటు, లైంగిక వేధింపుల అంశం కూడా ప్రస్థావించాడు దర్శకుడు. అలా మిక్స్‌డ్ టోన్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే:
నాగ చైతన్య ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పాత్రల్లో కనిపించలేదు. అతనికిది కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుంది నటన పరంగా. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. సాయి పల్లవి ఉత్తమ నటి. మరోసారి అది నిరూపితమైంది. రకరకాల హావభావాలు పలికించడంలో భేష్ అనిపించుకుంది. ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల, దేవయాని తమ తమ పాత్రల్లో మెప్పించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం ఆకట్టుకుంది. పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. నేపథ్య సంగీతం అలరిస్తుంది.

చివరిగా:
శేఖర్ కమ్ముల సినిమాల్లో నటీ నటులు కనిపించరు. మన పక్కింటి కుర్రాడు, మనింట్లోని అమ్మాయి.. ఇలా ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి సినిమాతోనూ సమాజానికి ఏదో మంచి చెప్పాలనుకుంటాడు. ఈ సినిమాతోనే అదే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్ చివరిలో డార్క్ టోన్ కాస్త ఇబ్బంది పెడుతుంది. అదే కొంత మందికి నచ్చుతుంది కూడా. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో, ప్రేక్షకులకు తెలుసు కాబట్టి, పెద్దగా నిరాశ చెందరు. ఓ మంచి సినిమా చూశామన్న ఫీల్ తప్పక కలుగుతుంది.

మాగల్ఫ్ రేటింగ్: 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com