సరికొత్త యాప్‌ను రూపొందించిన బీఎస్ఎన్ఎల్...

- March 18, 2016 , by Maagulf
సరికొత్త యాప్‌ను రూపొందించిన బీఎస్ఎన్ఎల్...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఇంట్లోని ల్యాండ్‌లైన్‌ను అనుసంధానం చేసుకుని మాట్లాడుకోవచ్చు. అంటే అదనపు చార్జీలు లేకుండా, నెలవారీ బిల్లులు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఈ యాప్ ద్వారా వస్తుంది. అయితే, ఈ యాప్ కేవలం విదేశాలకు వెళ్లేవారికి మాత్రమే ఎంతో అనుకూలంగా ఉంటుందని, ఆ సంస్థ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ విదేశాలకు వెళ్లే భారతీయులు.. స్వదేశంలోని తమ బంధువులతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఐఎస్డీలో మాట్లాడాల్సి ఉంటుంది. దీంతో బిల్లు తడిసిమోపెడవుతుంది. ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత ఎక్కువగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.కానీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా రూపొందించిన యాప్‌ నుంచి అయితే అటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. కేవలం నెలవారీ చార్జీలు చెల్లించి ప్రపంచంలోని ఎక్కడి నుంచి అయినా భారత్‌లోని బంధువులతో నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని వివరించారు. ఈ యాప్ పేరు ఫిక్స్‌డ్‌ మొబైల్‌ టెలిఫోనీ (ఎఫ్‌ఎంటీ) అని తెలిపారు. ఈ సదుపాయం ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈ సంస్థ వినియోగదారులు ఎవరైనా విదేశాలకు వెళితే వారు తమ మొబైల్‌ ఫోన్‌ను ఈ యాప్‌ ద్వారా వారి ల్యాండ్‌లైన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. దాని ద్వారా భారతదేశంలోని ఫోన్లకు కాల్స్‌ చేసుకోవచ్చు. తద్వారా వారికి ఐఎస్‌డి బిల్లు పడదు. కేవలం నెలవారీ చార్జీలను మాత్రమే వసూలు చేస్తారు. ప్రీపెయిడ్‌, పోస్టుపెయిడ్‌ కస్టమర్లకు నెలవారీ చార్జీని నిర్ణయించాల్సి ఉందని, అయితే వినియోగదారులు వారు వినియోగించే నెట్‌వర్క్‌ని బట్టి కాల్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వాళ్లు ల్యాండ్‌లైన్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తుంటే వారికి ల్యాండ్‌లైన్‌ చార్జీలు వర్తిస్తాయని, మొబైల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తుంటే దాని చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com