కథకళి రివ్యూ
- March 18, 2016
విశాల్, కేథరిన్ , మైమ్ గోపీ, మధుసూదన్ రావు, లక్ష్మీ రామకృష్ణన్, శ్రీజిత్ రవి తదితరులు సంగీతం: హిప్ హాప్, ఛాయాగ్రహణం: బాల సుబ్రహ్మణ్యం, కూర్పు : ప్రదీప్,
రచన, దర్శకత్వం:
పాండిరాజ్, నిర్మాత: విశాల్, సంస్థ: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ విడుదల: 18 మార్చి 2016 పందెం కోడితో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు విశాల్ . ఆ తరవాత ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతటి విజయం మాత్రం దొరకలేదు. కానీ తమిళంలో్ విడుదలైన ప్రతి సినిమానీ తెలుగులోనూ తీసుకొచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు. ఈసారి విశాల్‌కి పాండిరాజ్ అనే ప్రతిభావంతుడైన దర్శకుడు తోడయ్యాడు,. పసంగతో దక్షిణాది మొత్తాన్ని ఆకట్టుకొన్నాడు పాండిరాజ్. అందుకే వీరిద్దరి కలయికలో వచ్చిన కథకళిపై అందరి దృష్టిపడింది. మరి ఈ జోడీ మ్యాజిక్ చేసిందా, కథకళి విజయాన్ని అందుకొందా? చూద్దాం... పదండి. కథేంటి? కాకినాడలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ పాండు ఓ దాదా. నగరమంతా తన చెప్పుచేతల్లోనే ఉండాలనుకొంటాడు. అడ్డొచ్చిన వాళ్ల అంతు చూస్తాడు. పాండుకి చాలామంది శత్రువులు ఉన్నారు. కమల్ (విశాల్) కుటుంబానికీ ఆ పగ ఉంది. కమల్ అన్నయ్య వ్యాపారాలకు అడ్డొచ్చిన పాండు.. ఆ కుటుంబాన్ని దారుణంగా అవమానిస్తాడు. `నీ అంత డబ్బు సంపాదించి.. నిన్నే చంపుతా` అంటూ సవాల్ విసురుతాడు కమల్. ఆ తరవాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయి నాలుగేళ్ల తరవాత తిరిగొస్తాడు. నాలుగేళ్లయినా కాకినాడ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. కమల్ మాత్రం తన పాత పగ మర్చిపోతాడు. ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరితో పెళ్లి ఖాయం అవుతుంది. నాలుగు రోజుల్లో పెళ్లి ఈలోగా పాండుని ఎవరో హత్య చేస్తారు. ఆ నేరం కమల్ కుటుంబంపై పడుతుంది. పాండు హత్యతో కాకినాడ ఉడికిపోతుంది. పెళ్లి పనుల కోసం వైజాగ్ వెళ్లిన కమల్ కి కాకినాడలో ఏం జరుగుతుందో అర్థం కాదు. కమల్ కుటుంబం మొత్తం రోడ్డుపై పడుతుంది. మరి పాండుని ఎవరు హత్య చేశారు? ఈ కేసు నుంచి కమల్ బయటపడ్డాడా లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే కథకళి చూడాలి. ఎలా ఉంది? మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ ఇది. కేవలం ఆ పాయింట్ చుట్టూనే కథ నడిపితే సినిమా మొత్తం ఒక గంటలో తేలిపోతుంది. అందుకే పాండిరాజ్ ఈ కథలో ఓ ప్రేమ కథ జోడించాడు. విశ్రాంతి ముందు వరకూ ఈ లవ్ ట్రాకే నడుస్తుంది. అయితే అదంత గొప్పగా లేకపోవంతో సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకుల సహనానికి పరీక్ష మొదలవుతుంది. మొహాలు చూసుకోకుండా ఫోన్లోనే ప్రేమించుకోవడం అనే పాత కాన్సెప్ట్ నే మళ్లీ వాడుకొన్నాడు పాండిరాజ్. విరామం ముందు మర్డర్ మిస్టరీ మొదలవుతుంది. అక్కడైనా సన్నివేశాలు వేగంగా పరిగెట్టాలి. కానీ... అక్కడ కూడా బోర్ కొట్టించాడు పాండిరాజ్. విశాఖపట్నం నుంచి కాకినాడ ప్రయాణం ఏకంగా అరగంట సాగదీశాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఫోన్ సంభాషణల సన్నివేశాలు ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం ట్విస్టు మీద ట్విస్టు వచ్చిపడిపోతుంటాయి. ఆఖరి మూడు నిమిషాల్లో మూడు ట్విస్టులు విప్పాడు దర్శకుడు. ఆ మలుపు కూడా గొప్పగా ఏమీ లేదు. విశాల్ సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు ఆశిస్తారు ఈ సినిమాలో అవి ఆశించినంతగా పండలేదు. ఎవరెలా? విశాల్‌కి ఇలాంటి పాత్రలు కొత్త కాదు. ఈజీగానే పరకాయ ప్రవేశం చేశాడు. తన రంగుపై తానే సెటైర్లు వేసుకొన్నాడు. కేథరిన్ అందంగా కనిపించింది. తొలి సగంలో హడావుడి చేసింది గానీ.. సెకండాఫ్‌లో కనిపించింది చాలా తక్కువ. నటీనటులంతా తమిళం వారే. వాళ్ల పాత్రలు రిజిస్టర్ కావు. పాటలు తక్కువే, కానీ అవీ భరించలేం. హిప్ హాప్ తన ఆర్ ఆర్ స్పీడు స్పీడుగా కొట్టాడు గానీ అంత వేగం సినిమాలో లేదు, ఎన్నో అశలు పెట్టుకొన్న పాండిరాజ్ కూడా అన్ని విభాగాల్లో నిరాశ పరిచాడు. అనుకూలాంశాలు విశాల్ చివర్లో ట్విస్టులు ప్రతికూలాంశాలు కథ, కథనం వినోదం లేకపోవడం చివరిగా: కథ లేక తాళం తప్పిన కథకళి గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







