అవార్డులు మరెంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి:ఉపరాష్ట్రపతి

- October 13, 2021 , by Maagulf
అవార్డులు మరెంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి:ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని, భాషాభివృద్ధి దిశగా యువత ముందుకు రావడానికి దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు తెలిపారు.వెంకయ్య నాయుడు డిగ్రీ చదివే రోజుల్లో వారి తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా స్వయంగా అవార్డును నెలకొల్పి, తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్య కి అందజేశారు.
 
తమ ఆచార్యుల పేరిట అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి,పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. చదువు నేర్పిన గురువు సాక్షాత్తు భగవంతుడి స్వరూపమన్న పెద్దల మాటలను ఉద్ఘాటించిన ఆయన, శ్రీరాముడు, శ్రీకృష్ణడు లాంటి పురాణపురుషులు సైతం గురు సుశ్రూషలు చేశారన్నారు. డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల,  హనుమజ్జానకీరామ శర్మ మక్కువ పెరిగేలా చేశారన్న ఉపరాష్ట్రపతి, తమ రాజీకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన స్వతహాగానే పెంచుకోగలిగినా, వాటిని ధాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతోనే వచ్చిందన్నారు.
 
ఏటా తమ మిత్రులు నిర్వహించే  పోలూరు హనుమజ్జానకీరామశర్మ జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ ఇబ్బందుల కారణంగా పాల్గొనలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఇవాళ అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సందర్భాన్ని గురురుణం తీర్చుకోవడంగా పత్రికల్లో రాశారన్న ఆయన, ఇలాంటివి ఎన్ని చేసినా తల్లిదండ్రుల రుణం, గురువుల రుణం తీర్చుకోలేమని తెలిపారు.పోలూరి హనుమజ్జానకీరామ శర్మ గారిని చూడగానే ఏదో తెలియని గౌరవం కలుగుతుందన్న ఉపరాష్ట్రపతి, సంప్రదాయబద్ధమైన పంచె కట్టు, చక్కని బొట్టు, పండిత వర్చస్సుతో ఇట్టే ఆకర్షించే మూర్తీభవించిన తెలుగుదనం వారిదని తెలిపారు.
 
తెలంగాణ సారస్వత పరిషత్ అంటే తమకు ప్రత్యేకమైన అభిమానమన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషను నేర్చుకోవడం కూడా నేరంగా పరిగణించే రోజుల్లో, తెలుగు భాషను సంరక్షించుకునే సంకల్పంతో 1943లో ఈ సంస్థ ఏర్పాటైందన్నారు. ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటూ తెలుగు భాషా వెలుగుల్ని ముందు తరాలకు అందించేందుకు కృషి సలుపుతున్న పరిషత్తు కార్యక్రమాలు స్ఫూర్తి దాయకమన్న ఆయన, సంస్కృతి సారస్వత వికాసానికి కృషి చేయడం, నిరక్షరాస్యతను నిర్మూలించి మాతృభాషలో విద్యావ్యాప్తి కొనసాగించడం లాంటి ప్రధాన ఉద్దేశాలతో ప్రారంభమై... సభలు సమావేశాల నిర్వహణ, ప్రాచీన సారస్వత ముద్రణ, పారిభాషిక-మాండలిక పదకోశాల తయారీ లాంటి కార్యక్రమాలను కొనసాగించడం ముదావహమని తెలిపారు. ఈ సందర్భంగా నాటి అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావు, సి.నారాయణరెడ్డి కృషిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, వారి స్ఫూర్తితో తెలంగాణ సారస్వత పరిషత్ ముందుకు సాగుతుండడం అభినందనీయమని తెలిపారు.
 
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కోవెల సుప్రసన్నా చార్యకి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, కవిగా... పద్య విద్య మీద గాఢమైన అనురాగం ఉన్నా, ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు వారు కృషి చేశారని తెలిపారు. సమాజంలో అక్కడక్కడా పేరుకుపోయిన వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయ తత్వవేత్తల దృష్టిని సమగ్ర యోగ భావనలను కవిత్వంలోకి ప్రవేశపెట్టే చొరవ చేసిన సుప్రసన్నాచార్య, ఆధునిక సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదాన్ని ఆవిష్కరించారని తెలిపారు. ఇలాంటి వారి స్ఫూర్తితో మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి, మాతృదేశం, చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించిన వసుధైవ కుటుంబక భావన, ప్రకృతిని ప్రేమించడం – ప్రకృతితో కలిసి జీవించడం లాంటి అంశాలను యువత అవగతం చేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డా. జె.చెన్నయ్య... సాహిత్య అకాడమీ ప్రచురణల్లో భాగంగా రచించిన పరిషత్ పూర్వ అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావు జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారు భారత అమృతోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన కవితా సంకలనం అమృతోత్సవ భారతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమృతోత్సవ భారతి పుస్తకంలో ఎంతో స్ఫూర్తి దాగి ఉందన్న ఆయన, నాడు స్వరాజ్య ఉద్యమంలో ఎంతో మంది కవులు దేశభక్తిని ప్రబోధించి ఉద్యమం దిశగా ప్రేరేపించారని, ఈ పుస్తకం ఆ స్ఫూర్తిని మరింత ఉత్తేజితం చేసే విధంగా ఉందని తెలిపారు.
 
మాతృభాష ఔన్నత్యాన్ని వివరించిన ఉపరాష్ట్రపతి, రాజకీయంగా, సామాజికంగా, వివిధరంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారిలో చాలా మంది వారి వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేశారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి పేర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పరిపాలన, న్యాయరంగంతోపాటు ప్రజలతోనేరుగా అనుసంధానమయ్యే ప్రతిరంగంలోనూ మాతృభాష వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్నీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. 
 
అంతకుముందు,పోలూరి హనుమజ్జానకీ శర్మ సాహిత్యసేవను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి తిలకించారు.తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య, పురస్కార గ్రహీత ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి డా. ఆర్. ప్రభాకర రావు, ఆల్ ఇండియా రేడియో విశ్రాంత డీజీ రేవూరు అనంత పద్మనాభ రావు, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ సహా పలువురు భాషాభిమానులు, భాషావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com