రెండు పార్టులుగా జీ తెలుగు కుటుంబం అవార్డుల వేడుక!

- October 22, 2021 , by Maagulf
రెండు పార్టులుగా జీ తెలుగు కుటుంబం అవార్డుల వేడుక!

హైదరాబాద్: జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని జీ తెలుగులో రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నారు.తొలి భాగాన్ని ఈ నెల 23వ తేదీ, శనివారం సాయత్రం 6.00 గంటలకు, రెండవ భాగాన్ని ఇదే నెల 31వ తేదీ, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ప్రసారం చేస్తారు. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ లోని నటీనటులంతా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యులుగా మారిపోయారు. దాంతో ఆ సీరియల్స్ లో వారి నటనను బేరీజు వేస్తూ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమంలోనూ వీక్షకులు భాగస్వాములుగా మారిపోయారు. అలా ఈ యేడాది ఏ యే సీరియల్స్ కు, అందులో ఏ యే నటీనటులకు అవార్డులు దక్కాయో మరో 24 గంటలలో తెలియబోతోంది.

విశేషం ఏమంటే… మిల్కీ బ్యూటీ తమన్నా, అందాల సుందరి మెహ్రీన్ ఫిర్జాదా, కృతీశెట్టి, సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా, ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్, నిహారిక కొణిదెల, అలీ, ఆకాశ్ పూరి, నిఖిల్, సుధా చంద్రన్, హెబ్బా పటేల్, సురభి తదితరులు ఈ వేడుకకు అతిథిలుగా హాజరయ్యారు.

శ్యామల, ప్రదీప్ మాచిరాజు, శ్రీముఖి, అఖిల్ సార్థక్ రెండు రోజుల పాటు సాగిన ఈ అవార్డుల కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు. వీరి కామెడీ టైమింగ్ తో అవార్డుల వేడుకలో నవ్వుల పువ్వులు పూశాయి. భర్తతో కలిసి శ్రియా ఓ అవార్డుల వేడుకకు హాజరు కావడం ఇదే తొలిసారి కాగా, బ్యూటీఫుల్ హీరోయిన్ మెహ్రీన్ యాంకర్ అఖిల్ తో కలిసి ‘ఏమై పోతావే’ పాటకు డాన్స్ చేయడం మరో విశేషం. ఇక ప్రదీప్, శ్రీముఖి, అఖిల్ తో కలిసి తమన్నా ‘ఎఫ్‌ 3’ థీమ్ స్కిట్ ను చేసి అలరించడం కార్యక్రమంలో మరో హైలైట్.

అకుల్ బాలాజీ ఈ వేడుకలో తన తల్లికి పాదపూజ చేయగా, నటి, నృత్యకారిణి సుధాచంద్రన్ తన తండ్రి గురించి మాట్లాడారు. ఇక జై ధనుష్, కీర్తి జై ధనుష్‌ తమ పాపను తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు చేతుల మీదుగా ఊయలలో వేయించడం జీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. ఇలా సినీతారల డాన్సులు, జీ కుటుంబ సభ్యుల పెర్ఫార్మెన్స్ తో ఈ వేడుక మరో లెవెల్ కు చేరుకుంది. సో…. ఈ నెల 23, 31వ తేదీ సాయంత్రాలు జీ తెలుగు వీక్షకులకు పండగే పండగ!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com