నటుడు రాజబాబు కన్నుమూత

- October 25, 2021 , by Maagulf
నటుడు రాజబాబు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు రాజబాబు (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి మృతిచెందినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్‌తోనే గుర్తింపు తెచ్చుకున్నారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రాజబాబు మరణంపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్‌ 13న రాజబాబు జన్మించారు. నటనపై ఆసక్తితో చిన్నతనంలోనే నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో రాజబాబు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

ఆ తర్వాత ‘సింధూరం’, ‘సముద్రం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘మురారీ’, ‘శ్రీకారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కళ్యాణ వైభోగం’, ‘మళ్ళీ రావా?’, ‘బ్రహ్మోత్సవం’, ‘భరత్ అనే నేను’ తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 62 చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. ‘వసంత కోకిల’, ‘అభిషేకం’, ‘రాధా మధు’, ‘మనసు మమత’, ‘బంగారు కోడలు’, ‘బంగారు పంజరం’, ‘నా కోడలు బంగారం’, ‘చి ల సౌ స్రవంతి’ తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఆయన అలరించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయన నంది అవార్డు అందుకున్నారు. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదాగా వుంటారు. ఆయనతో వున్న చనువుతోనే అందరూ రాజబాబుని బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. అలాంటి వ్యక్తి కన్నుమూయడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగే పలువురు నటులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com