మంద భీంరెడ్డి అంటే... మార్పుకు ప్రతినిధి (ఎజెంట్ ఆఫ్ చేంజ్)

- March 19, 2016 , by Maagulf
మంద భీంరెడ్డి అంటే... మార్పుకు ప్రతినిధి (ఎజెంట్ ఆఫ్ చేంజ్)

 

కెరటం.... నువ్వంటే నాకు చాలా ఇష్టం... పడినా ఇంకో ప్రయత్నం కోసం లేచి నిలబడతావని... అంటూ సముద్ర తరంగాన్ని మెచ్చుకుంటాడు ఓ కవి!

మంద భీంరెడ్డిది అలాంటి స్ఫూర్తే... అల లాంటి నైజమే!

ఓటమి రేపటి గెలుపుకి తొలిమెట్టు... అనుభవ పాఠానిది విజయం కన్నా పెమైట్టు! 

యాబై ఏళ్ల వయసున్నమంద భీంరెడ్డి ముప్పయి ఏళ్ల  ప్రజా జీవన ప్రయాణాన్ని పరికిస్తే ఈ విషయం అర్థమవుతుంది.. బతికే ధైర్యం వస్తుంది... ప్రేరణ దొరుకుతుంది..

ఆ ప్రయాణానికి తొలి అడుగు... 1985లో పడింది 'జీవగడ్డ' అనే ఈవెనింగ్ డైలీతో. అప్పుడు 19 ఏళ్ల వయసున్న ఆయన బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. విద్యార్థిరాజకీయాల్లో చాలా చురుకుగా ఉండేవారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌.ఎస్‌.యు.ఐ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల గురించి తరచూ పత్రికా ప్రకటనలు ఇచ్చేవారు. ఆయన ఉత్సాహాన్ని గమనించిన 'జీవగడ్డ' పత్రికా సిబ్బంది ‘నీ దృష్టికి వచ్చిన సమస్యల గురించి మా పత్రికకు రాసి పంపొచ్చు కదా’ అని అడిగారు. ఉత్సాహం ఉన్న వాళ్లకు ఆ మాత్రం అవకాశం చాలు... అంతే భీంరెడ్డి ఆ చిన్న పత్రికలో.. తక్కువ స్పేస్‌నే తన అక్షరసత్యాలకు గొప్ప వేదికగా మలచుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే తన రాతలకు గొప్ప స్పందనను రాబట్టుకున్నాడు. డిగ్రీ సెకండియర్‌లోకి వచ్చేసరికి జగిత్యాలలో 'ఉదయం' దినపత్రికకు విలేకరిగా చేరారు. అలా 1986 నుంచి 96 వరకు 'ఉదయం' మూతపడే వరకు ఆ పత్రికలోనే పనిచేశారు. ఓవైపు విలేకరిగా విధులు నిర్వరిస్తూనే డిగ్రీ అయిపోగానే ఉపాధి కోసం జీవిత బీమా సంస్థలో ఎజెంట్‌గా చేరాడు. దాంతో ఏకకాలంలో ఇటు విలేకరిగా అటు ఎల్.ఐ.సి ఎజెంట్‌గా బిజీ అయిపోయారు.

'ఉదయం' లాకౌట్‌తో.. ఏంచేయాలో పాలుపోలేదు భీంరెడ్డికి. అప్పుడే దుబాయి నుంచి వచ్చిన ఓ స్నేహితుడు చెప్పాడు.‘ఇక్కడ ఎలాగూ ఇన్సురెన్స్ చేస్తున్నావ్ కదా.. దుబాయిలో కూడా ఇన్సురెన్స్ కంపెనీలో మంచి అవకాశాలున్నాయి. దుబాయ్‌కి రా... ఇదే అనుభవంతో అక్కడ పనిచేద్దువుగాని... బాగుంటుంది’ అని చెప్పాడు. ఆ సలహా భీంరెడ్డికి నచ్చింది. ఆ స్నేహితుడి సహాయంతోనే బీమా కంపెనీ ఆహ్వానంపై విజిట్ వీసా మీద దుబాయ్ వెళ్ళాడు. గెస్ట్ హౌజ్‌లో మకాం. మొదటి మూడు నెలలు చూశాక తర్వాత త్రీ ఇయర్స్ జాబ్ వీసా ఇస్తామన్నారు. ఓకే అనుకొని మొదటి మూడు నెలలు పనిలోకి దిగాడు. అయితే ఇండియాలో ఎల్.ఐ.సి. ఎజెంట్ గా చేయడానికి ... దుబాయ్‌లో చేయడానికి చాలా తేడా ఉంటుంది అని మొదటి నెలలోనే తెలిసొచ్చింది ఆయనకు. ఎజెంట్‌గా విజయం సాధించడానికి ముఖ్యమైన కమ్యునికేషన్స్ స్కిల్స్ మెరుగుపర్చుకునే పనిలోపడ్డాడు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల మీద పట్టుకోసం ప్రయత్నించాడు. వీటన్నిటిలో మొదటు మూడు నెలలు పూర్తయ్యాయి. వీసా గడువు ముగియడంతో ఇండియా వెళ్లిపోయి తిరిగి మూడు నెలల వీసాతో మళ్లీ దుబాయ్ వచ్చాడు. ఈసారి బీమా సంస్థ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసి మూడు సంవత్సరాల ఉద్యోగ వీసాను పొందాడు. ముఖ్యమైన అడ్డంకులు దాటాను కాబట్టి ఇంకా అంతా విజయమే అనుకున్నాడు. కాని విధి మనుషుల సామర్థ్యానికి ఎప్పటికప్పుడు కొత్త పరీక్షలు పెడ్తూనే ఉంటుంది కదా... ఆ పరీక్షలు భీంరెడ్డికీ మొదలయ్యాయి. మూడు .. మూడు నెలల విజిట్ వీసా అనంతరం మూడేళ్ల ఉద్యోగ వీసాలో తనను నెల జీతగాడిగా తీసుకుంటారని అనుకున్నాడు భీంరెడ్డి. కానీ వీసా మారింది కానీ ఉద్యోగ విధులు, విధానాలు, టర్మ్స్ అండ్ కండీషన్స్ మారలేదు. కమీషన్ బేసిస్ మీదే ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ రానురాను ఆ పోటీని తట్టుకోలేకపోయాడు. ఆ వేగాన్ని అందుకోలేకపోయాడు. ఆ సమయంలోనే ఓ వైపు లైఫ్ ఇన్సూరెన్స్ ఎజెంట్‌గా పనిచేస్తూ మరోవైపు పార్ట్ టైంగా మనీ ట్రాన్స్ ఫర్, జాబ్స్ కన్సల్టెంట్ గా కూడా పనిచేసేవాడు. అయితే దేనికీ కాలం ఆయనతోపాటుగా కలిసి నడవలేదు. చాలా నష్టపోయాడు. మూడేళ్ల తర్వాత చేదు అనుభవాల మూటతోనే 2000 సంవత్సరంలో ఇండియాలో ల్యాండ్ అయ్యాడు.

విజయం కన్నా అనుభవం గొప్పది.. అన్నట్టుగానే ఉప్పు ఊట అందించిన చేదు మూటనే కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో తన కొత్త అడుగుకి ప్రేరణగా తీసుకున్నాడు. దాన్నే పెట్టుబడిగా పెట్టి...ఓ ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. జగిత్యాల ఆయన సొంతూరు నాగునూరు-లచ్చక్కపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా అప్పర్ ప్రైమరీ స్కూల్ చదువు నుంచి డిగ్రీ.. తర్వాత వృత్తి అంతా అక్కడే సాగాయి. కాబట్టి మలి ప్రయాణంలోని తొలి ప్రయత్నానానికీ జగిత్యాలనే కేంద్రంగా చేసుకున్నాడు. పైగా అప్పటికి గల్ఫ్‌లోని వలసల జీవితాన్నీ దగ్గరుండి చూసొచ్చాడు, వాళ్ల సమస్యల పట్లా ఓ అవగాహన వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి తాను ఏం చేయగలడో... ఏం చేస్తే తనకూ.. వలస కార్మికులకూ ఉమ్మడి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకునే ట్రావెల్ ఏజెన్సీని పెట్టాడు. ముహూర్తబలం.. సంకల్ప సిద్ధి రెండూ బాగుండి ఉంటాయి.. త్వరలోనే ఏజెన్సీ బాగా పుంజుకుంది. అప్పుడే మొదలైన సాంకేతికమార్పుల పలితాలను వెంటనే ఊహించి వాటిని పట్టుకొని లైసెన్స్ తీసుకొని మనీ ఎక్సేంజ్‌నూ ఆరంభించాడు. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతనిది రెండో ఫారిన్‌మనీ ఎక్సేంజ్. ఏర్ టికెటింగ్, రైల్వేబుకింగ్ కౌంటర్‌నూ తెరిచాడు. ఆ సమయానికి జగిత్యాల్‌లో ఇది ఓ చిన్నపాటి విప్లవమే! వీటితో పాటు జీవిత బీమా ఏజెన్సీ... క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్ సంతృప్తికరమైన ఆదాయాన్నీ అందించసాగింది. జగిత్యాల్‌లో ఓ ఇల్లూ కట్టుకున్నాడు. అంతకు ముందు ఊళ్లో తమ కుటుంబం పొగొట్టుకున్న ఆస్తులను తిరిగి కొనుక్కొని పోయిన గౌరవాన్ని వాళ్ల తల్లిదండ్రులకు మళ్లీ కల్పించాడు.  అంతా సవ్యంగా సాగిపోతే విధిని, విధాతను తలచుకోరు కదా.. అందుకే భీంరెడ్డి సామర్థ్యానికి ఈ ఇద్దరూ కొత్త పరీక్షను సిద్ధం చేశారు. అందులో భాగమే

2010 ఏర్ ట్రావెల్స్ విషాదం:  హైదరాబాద్‌లో ఒక మహిళ నిర్వహిస్తున్న ఏర్ ట్రావెల్స్, ఆమె చెప్పిన వివరాలు, చేస్తున్న పని సహజంగానే అనిపించాయి. దాంతో ఆ ట్రావెల్స్‌కి జగిత్యాల నుండి వ్యాపారాన్ని ఇచ్చారు భీంరెడ్డి. తన వ్యాపారాన్నీ వృద్ధి చేసుకోవచ్చనే తలపుంతో తన తమ్ముడితో పాటు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఒక బ్యాడ్ మార్నింగ్ ఆ ట్రావెల్స్ యజమాని చేతులెత్తేసింది. అప్పటికే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ల చదువులు... అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. అప్పటికే హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన భీంరెడ్డి, ఊర్లోని ఆస్తులన్నీ అమ్మాల్సివచ్చింది. 

2011... అరబిక్ కడలి నేర్పిన పాఠం.. జగిత్యాల జీవితం... హైదరాబాద్‌లో మరో ప్రయాణానికి బాటను సిద్ధం చేశాయి. పిరికితనం దరి చేరనంత వరకు ఆకాశమే హద్దు... ఆత్మవిశ్వాసం చెలిమిలో బంధి. ఇంక భయం దేనికి? అవకాశాల అంతు చూడాల్సిందే అనుకున్నాడు. ఆశతో వెదికాడు కాబట్టి కొత్త దారి కనపడింది. ప్రముఖ వలస కార్మిక సంఘం 'మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్' అధ్యక్షులు పి.నారాయణ స్వామి రూపంలో. చిరు ఉద్యోగమే అయినా నిరుత్సాహపడలేదు. 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' వారి ప్రాజెక్టులో పీ.ఆర్‌.ఓ గా చేరాడు. గల్ఫ్ కార్మికుల హక్కులను అధ్యయనం చేసే ఛాన్స్ దొరికింది. వాళ్ల సమస్యల లోతునూ తెలుసుకునే వీలు కలిగింది. వివిధ దేశాలు పర్యటించే అవకాశం వచ్చింది. గల్ఫ్ ఓ విషవలయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలక్ష్యం చేస్తున్న అత్యంత ప్రధాన విషయం అని తెలుసుకున్నాడు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది గల్ఫ్ వలస కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడ అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చేశాడు. నెలలకు నెలలు దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న శవాలను ఇండియాకు తెప్పించి వాళ్లవాళ్లు చివరి వీడ్కోలు ఇచ్చేలా చేశాడు. అంతిమసంస్కారాలకు ఆస్కారం కల్పించాడు. మూడేళ్ళ తర్వాత 2014 లో 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' వారి ప్రాజెక్ట్ పూర్తయింది, ఆ చిరు ఉద్యోగం కూడా పోయింది. మళ్లీ చుట్టూ ఎండమావులే! ఈసారి తనకు తానే ఇంకో కొత్త పరీక్షను పెట్టుకోదలుచుకున్నాడు. అదే

2014 లో 'ప్రవాసి మిత్ర'...

ఓ మాస పత్రిక. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడికే చేరాడు.. అయితే నిరాశ, నిస్పృహలతో కాదు... ఉత్సాహం, ఉత్తేజం... పట్టుదలలతో! కొత్త లక్ష్యాలను సాధించే కృతనిశ్చయంతో. ఇన్నేళ్ల పాఠాలను శోధించి థీసెస్ రాసే క్రమంలో మొదలైంది భీంరెడ్డి ఈ మూడో ప్రయాణం. తెలిసో తెలియకో... ఆసక్తితోనో... బాధ్యతగానో గల్ఫ్ అగాధంలోకి వెళ్లాడు.. ఆ చీకట్లను చేదించి పరిష్కారమనే జలనిధిని పట్టుకోందే పట్టు విడవొద్దనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నాడు.

 

‘ఇన్నేళ్ల నా ప్రయాణం నాకెన్నో పాఠాలను నేర్పింది. ముఖ్యంగా గల్ఫ్. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌లో మొత్త 20లక్షల మంది ఉన్నారు. అంటే చెరి పది లక్షల మందిని ఉపాధి కోసం అరేబియా అలలను దాటుతున్నారు. ప్రతి నెల వీరి నుంచి మన దేశానికి 2 వేల కోట్ల ఫారిన్ మనీ ఎక్సేంజ్ అవుతోంది. ఈ రోజు మనం మన దేశంలో వాడే ప్రతి చుక్క పెట్రోల్,డీజిల్ అక్కడి మన కార్మికుల చెమట బిందువులే. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం మానవ వనరులను ఎగుమతి  చేసి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. అంటే వస్తుమార్పిడి వ్యాపారాన్ని పాటిస్తోంది. ఇక్కడి కార్మికులను వస్తువులుగా చేసి ఇంధనం కోసం మార్పిడి చేస్తోంది. వాళ్ల సమస్యలను మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. అక్కడ వాళ్లు సంపాదించే ప్రతి పైసా ఫారిన్ మనీ రూపంలో ఇక్కడికే వస్తోంది. కాని హక్కుల విషయం వచ్చేటప్పటికి కాసుమందమైనా ఉపయోగించుకోవట్లేదు వాళ్లు. అసలా అవకాశమే లేదు వాళ్లకు. దేశ రక్షణకోసం సైన్యంలో చేరుతున్న సైనికులకు ఏ మాత్రం తీసిపోరు వీళ్లు. కాని వాళ్లకున్న గుర్తింపు వీళ్లకు లేదు. ముఖ్యంగా కార్మికులు, చిరుద్యోగులు’ అని ఆవేదన వెలిబుచ్చుతారు వాళ్ల సమస్యల గురించి.

 

గల్ఫ్ వలసల విషయంలో మనకు, కేరళకున్న వ్యత్యాసాల గురించి భీంరెడ్డి మాట్లాడుతూ...‘మన దగ్గర అరకొర చదువులతోనే గల్ఫ్‌కి వెళ్తున్నారు. అందుకే వాళ్లు అక్కడ  అన్‌స్కిల్డ్ లేబర్‌గా, మాన్యువల్ లేబర్‌గానే పనిచేయాల్సి వస్తోంది. కానీ కేరళలో అలా కాదు. అక్కడ లేబర్‌గా వెళ్లేవాళ్లు చాలా తక్కువ. కారణం... వాళ్లకు హైస్కూల్ నుంచి గల్ఫ్ ఓరియంటేషన్‌తో చదువు చెప్తున్నారు. కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు, తెలంగాణ నుంచి లేబర్ ఎక్కువగా వెళ్తుంటే తూర్పు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల నుంచి డొమెస్టిక్ వర్కర్స్ ఎక్కువగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారాయి. తెలంగాణ నుంచి కూడా ఇంజనీరింగ్, ఎంబీఏ గ్రాడ్యూయేట్లూ గల్ఫ్‌కి వెళ్తున్నారు.

ఎజెంట్ల మోసాలు..

డబ్బులు తీసుకొని పంపించకపోవడం... మోసం, ఇలాంటి ఎజెంట్లను శిక్షించాలి. అయితే విదేశాలలో ఉద్యోగం, కంపెనీ పరిస్థితులు బాగా లేకపోవడం కూడా ఎజెంట్ మోసమనే అనుకుంటారు. చాలా సందర్భాలలో సబ్ ఎజెంట్లు కూడా గల్ఫ్ బాధితులవుతున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ పనికి ఎంత జీతం... గల్ఫ్ జీవితం ఎలా ఉంటుందనేది బహిరంగ రహస్యం. నిజానికి దీన్ని ప్రభుత్వ కుట్ర అనొచ్చు. గల్ఫ్ వలసలనేవి కొత్తవి కావు. 1970 నుంచీ ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచి ఎజెంట్లు మోసం చేస్తుంటే ఆ వ్యవస్థను ఎందుకు నియంత్రిచంట్లేదు? ఇంటలిజెంన్స్ అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకోవచ్చు కదా.. ? తెప్పించుకోదు. నియంత్రించదు. ఎందుకంటే ఎలాగైనా సరే ఆ కార్మికులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి... దీనివల్ల ఇక్కడ నిరుద్యోగ సమస్య కొంత తగ్గుతుంది... ఫారిన్ మనీ డిపాజిట్ అవుతుంది. ఆంక్షలు, నియంత్రణలు పెడితే కార్మికుల వలస తగ్గుతుంది. అందుకే ఎజెంట్ల మోసాలను చూసీచూడనట్టు ఊరుకుంటోంది ప్రభుత్వం. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం... ప్రజల్లోనే అవగాహన కలగాలి... చైతన్యం రావాలి. ఇందుకు ప్రవాసి కార్మికుల హక్కుల కోసం పనిచేసే కార్మిక సంఘాలను, స్వచ్చంద సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. గల్ఫ్‌ వలసల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. కేరళలాగా మనదగ్గర గల్ఫ్ ఓరియంటేషన్ కోర్సులను కరిక్యులమ్‌లో భాగం చేయాలి. గల్ఫ్ సాహిత్యాన్ని ఆదరించాలి, ప్రోత్సహించాలి’ అని అంటారు మంద భీంరెడ్డి. ‘గల్ఫ్ ఓ సామాన్య కార్మికుడికి ఇచ్చినట్టే నాకూ ఉప్పు రుచినే పంచింది. అయితే నేను భయపడలేదు. నా మొండితనం, మా కుటుంబసభ్యుల మద్దతు ఈ పోరాటంలో తీపిని పొందేదాకా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. నా వెన్నంటి ఉన్న అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు భీంరెడ్డి. 

మాగల్ఫ్ టీం తరుపున భీం రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

--మాగల్ఫ్ టీం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com