ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి:ఉపరాష్ట్రపతి

- October 31, 2021 , by Maagulf
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి:ఉపరాష్ట్రపతి

విజయవాడ: ఊరికో గ్రంథాలయం – ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలని, స్వచ్ఛ భారత్ వలే గ్రంథపఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని చారిత్రక రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఆదివారం నాడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తమ కుమార్తె  దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున 2.5 లక్షలు, కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలను గ్రంథాలయ అభివృద్ధి కోసం విరాళంగా ప్రకటించారు. అనంతరం తమ మనోగతాన్ని ఫేస్ బుక్ వేదికగా ఉపరాష్ట్రపతి పంచుకున్నారు. చారిత్ర ప్రదేశాలను యువత సందర్శించిన స్ఫూర్తిని పొందాలని ఆయన ఆకాంక్షించారు.

అక్షరపు శక్తి గ్రంథమైతే, అనేక పుస్తకాల శక్తిని తనలో నింపుకున్న చైతన్య స్రవంతులు గ్రంథాలయాలన్న ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలు జాతి సంపదగా విరాజిల్లాయని తెలిపారు. భారత స్వరాజ్య సంగ్రామంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయన్న ఆయన, చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిలించి, వికాసానికి నాంది పలికిన విషయాన్ని గుర్తు చేశారు.

దాదాపు 118 ఏళ్ళ చరిత్ర ఉన్న రామ్మోహన్ గ్రంథాలయ సందర్శన ఎంతో ఆనందాన్ని అందించిందన్న ఉపరాష్ట్రపతి, గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు ఈ సంస్థ కేంద్రబిందువుగా నిలిచిందని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధిలో నాటి కార్యదర్శి అయ్యంకి వెంకటరమణయ్య కృషిని ప్రస్తావించిన ఆయన, ఎంతోమంది మహనీయులు చందాలు పోగేసి, అప్పు చేసి ఈ గ్రంథాలయ స్థలాన్ని కొన్న సంఘటన ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. యువత తలచుకుంటే చరిత్ర గతి మారుతుందన్న విషయాన్ని ఈ సంఘటన తెలియజేస్తుందన్న ఆయన, ఈ దిశగా యువత కృషి చేయాలని ఆకాంక్షించారు.

గ్రంథాలయ సందర్శన గాంధీ మహాత్ముని స్మృతుల్ని గుర్తు చేసిందన్న ఉపరాష్ట్రపతి, మూడు పర్యాయాలు మహాత్ముడు ఈ ప్రదేశాన్ని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రజలను విజ్ఞానవంతులుగా మార్చి, చైతన్యం రగిలించేందుకు గ్రంథాలయ ఉద్యమం తోడ్పడిందన్న ఉపరాష్ట్రపతి, ప్రాచీన కాలం నుంచి మన జీవితంలో విప్లవాత్మక మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతున్నాయని తెలిపారు.  దేశాభివృద్ధికి, సాహిత్య జగతికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి, యుద్ధ సమయంలో, శాంతి సమయంలో, దేశ పునర్మిర్మాణ సమయంలో గ్రంథాలు సమస్త మానవాళికి అండగా నిలిచాయన్న ఆయన, సమస్యల అంధకారం ముప్పిరిగొన్న ప్రతి సందర్భంలోనూ మానవుణ్ని మహోన్నతునిగా మలచినవి పుస్తకాలేనని పేర్కొన్నారు.

పుస్తకాలు ఓ మతానికో, ఓ కులానికో, ఓ వర్గానికో పరిమితం కావన్న ఉపరాష్ట్రపతి, శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, మెదడును చైతన్యం చేయడానికి పుస్తకాలు అంతే ముఖ్యమని తెలిపారు. అయితే ప్రస్తుతం టీవీ, ఇంటర్నెట్ సంస్కృతి కారణంగా సమాజంలో క్రమంగా పఠనాసక్తి తగ్గిపోయిందన్న ఆయన, టీవీలకు పరిమితం కావడం, కంప్యూటర్ లో, మొబైల్ లో పుస్తకాలు చదివే అలవాటు కారణంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ముప్పిరిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయ సంస్కృతిని పెంపొందించుకోవడం ఈ సమస్యలన్నింటికీ కచ్చితమైన పరిష్కారాన్ని చూపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, మహోన్నతమైన వారసత్వాన్ని పిల్లలకు పరిచయం చేయడానికి పుస్తక పఠనం పెంపొందించడమే మార్గమన్న ఉపరాష్ట్రపతి, పిల్లలకు పుస్తకాలు చదవడాన్ని ఓ పనిగా కాకుండా ఆటపాటలతో సమానంగా చూసేలా ప్రోత్సహించాలని తెలిపారు. భారతీయ జనాభాలో 60 శాతానికి పైగా యువతరమే ఉందన్న ఆయన, వారిని ఉత్తేజితుల్ని చేసి, నవభారత నిర్మాణసారథులుగా, సమాజాన్ని ముందుకు నడిపే శక్తిచోదకులుగా తీర్చిదిద్దాలంటే ముందు వారిలో విజ్ఞాన బీజాలు నాటాలని తెలిపారు. అజ్ఞానం నుంచి విషయ పరిజ్ఞానంతో విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం, దేశం, ప్రపంచం రూపొందుతాయని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com