ఏపీ ప్రభుత్వ సంస్థ APNRTS అందిస్తున్న సేవలు..గల్ఫ్ కార్మికులకు 'బీమా' ప్రకటన
- November 02, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కి APNRTS ప్రధాన కార్యాలయంలో APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ కె. దినేష్ కుమార్ మరియు సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ ఎస్. మేడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి జర్నలిస్టులకు వివరించారు. మేడపాటి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ప్రవాసాంధ్రులకు అనేక సేవలు అందిస్తోందన్నారు.
APNRTS అందిస్తున్న వివిధ సేవలైన 24/7 హెల్ప్ లైన్, ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సర్వీస్, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, అడ్వాన్స్డ్ ఐటి కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు మరియు స్థానిక, విదేశీ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం, విద్యావాహిని ద్వారా విదేశాలలో విద్యా సంస్థల గురించి తెలియజేయడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులకు తగు సలహాలు అందించడం, ఏపీ పోలీస్ఎన్నారై సెల్ ద్వారా ప్రవాసాంధ్రులకు స్వరాష్ట్రంలో ఆస్తి, స్థల వివాదాలు, వివాహ సమస్యలు పరిష్కరించడం, అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులను స్వదేశం తీసుకురావడం, ఆయా దేశాలు ఆమ్నెస్టీ ప్రకటించినప్పుడు రాష్ట్రవాసులను ఉచితంగా స్వస్థలాలకు తీసుకురావడం వంటి అనేక సేవలను అందిస్తోంది. ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ ద్వారా ప్రవాసాంధ్రులు వారి గ్రామాలు, పట్టణాలలో పాఠశాలల్లో విద్యార్థుల కొరకు లైబ్రరీలు ఏర్పాటు చేయడం, ప్రవాసాంధ్రుల పల్లెలలో వారు కోరిన “నాడు-నేడు” లో లేని అవసరాలను పాఠశాలల్లో సమకూర్చడం, ఆసుపత్రులు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు చేయడం వాటిని ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ సంబంధిత శాఖలు, అధికారులతో సమన్వయము చేయడం, పాస్పోర్ట్,వీసాలలో మార్పులకు సహాయం, పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడంలో సహాయం, రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటన, తదితర సేవలను కూడా APNRTS అందిస్తోంది.
అంతేకాకుండా వలసకార్మికులు, NRTలు ఎక్కువగా విదేశాలకు వెళుతున్న పలు జిల్లాల్లో “సక్రమ వలస” గురించి APNRTS అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు ముందస్తు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలామంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే వీరు సరైన అవగాహన లేకుండా, అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి విదేశం వెళ్లి తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి, వలస వెళ్తున్న వారికి సరైన అవగాహన కల్గించడానికి వలసలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలో APNRTS అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే, కడప జిల్లా రాజంపేట, అమలాపురం నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం తరఫున APNRTS చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మీడియా సహకారం ఎంతో అవసరమని, అప్పుడే ప్రవాసాంధ్రులకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ప్రభుత్వ కార్యక్రమాలు తెలుస్తాయన్నారు.
APNRTS చైర్మన్ వెంకట్ ఎస్ మేడపాటి NRT లకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో బ్లూ కాలర్ ఉద్యోగాలు చేసే వారికి బీమా పథకాన్ని ప్రకటించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికులు వార్షిక రుసుము 550 రూపాయలు మరియు విద్యార్థి అయితే 180 రూపాయలతో జీవిత బీమా సేవను పొందవచ్చని వెంకట్ మీడియాను ఉద్దేశించి వివరించారు.
ప్రస్తుతం, గల్ఫ్ దేశాలలో మరణించిన వలస కార్మికుల కుటుంబ సభ్యులకు APNRTS నామమాత్రంగా రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను అందిస్తోంది.
APNRTS సీఈఓ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ...ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS అందిస్తున్న కార్యక్రమాలను వివిధ దేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన తెలుగు వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
APNRTS కార్యాలయాలు... ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో, ఉపకార్యాలయం “YSR ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” రాజంపేటలో కలవు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!