న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి: ఉపరాష్ట్రపతి
- November 02, 2021
విశాఖపట్టణం: ప్రజలందరికీ న్యాయాన్ని అందుబాటులోకి, ఆర్థిక భారం కాకుండా చొరవ మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. న్యాయస్థానాల కేసుల విచారణలో జాప్యాన్ని తగ్గించడం తక్షణావసరమని ఆయన సూచించారు.
మంగళవారం విశాఖపట్టణంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘స్వాతంత్రోద్యమ స్ఫూర్తి: ముందడుగు’ ఇతివృత్తంతో నిర్వహించిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో భారీగా పేరుకుపోయిన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడంతోపాటు, కోర్టు కేసుల విచారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
న్యాయస్థానాల్లో కేసుల విచారణకోసం అయ్యే ఖర్చులు కూడా గణనీయంగా తగ్గాల్సిన అవసరముందని.. అప్పుడే సామాన్య మానవుడు కూడా తనకు జరిగిన అన్యాయానికి ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వీలవుతుందన్నారు.
దేశంలో న్యాయ వ్యవస్థలో సానుకూలమైన మార్పులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా.. భవిష్యత్ న్యాయవాదులైన న్యాయ విద్యార్థులను మార్పునకు సారథులుగా (ఛేంజ్ ఏజెంట్స్) తీర్చిదిద్దాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు.
భారత రాజ్యాంగ పీఠిక.. మన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి నిదర్శనమని.. మన దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర రాజ్యంగా అభివర్ణిస్తూ, ప్రతి పౌరుడికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని కల్పించాలన్న వారి స్వప్నాన్ని మనమంతా కాపాడుకుంటూ ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
స్వాతంత్ర్యానంతరం వివిధ రంగల్లో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. గత వైభవాన్ని తలచుకుంటూ వర్తమానంలో ఉండిపోకూడదన్నారు. మరింత భవ్యమైన భవిష్యత్తును రచించుకునేందుకు సామాజిక రుగ్మతలైన.. పేదరికం, లింగవివక్షత, నిరక్షరాస్యత, కులవివక్ష, అవినీతి లను నిర్మూలించేందుకు జాతీయవ్యాప్త ప్రజా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు.
కులం, మతం, ప్రాంతం, భాషల ఆధారంగా మన ప్రజల్లో విద్వేశం రేకెత్తించేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాల పట్ల ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. బలమైన, భద్రమైన, సుభిక్షమైన, ఆరోగ్యకరమైన, ఆనందరకమైన భారతదేశ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన సూచించారు.
దామోదరం సంజీవయ్య శతజయంత్యుత్సవాల సందర్భంగా వారి పేరుతో ఏర్పాటుచేసిన న్యాయ విశ్వవిద్యాలయంలో ఉపరాష్ట్రపతి సంజీవయ్య కి ఘనంగా నివాళులు అర్పించారు. నీతి, నిజాయితీకి చిత్తశుద్ధికి దామోదరం సంజీవయ్య ప్రతిబింబంగా నిలిచారని.. వారు నిస్వార్థంగా దేశానికి చేసిన సేవ చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అంతటి గొప్ప వ్యక్తి పేరును ఈ విశ్వవిద్యాలయానికి పెట్టడం.. వారికి అర్పించే ఘనమైన నివాళి ఉపరాష్ట్రపతి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.సూర్యప్రకాష్, రిజిస్ట్రార్ ప్రొ. మధుసూదనరావు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్