టీ 20 ప్రపంచకప్‌లో అనుకోని విషాదం..

- November 08, 2021 , by Maagulf
టీ 20 ప్రపంచకప్‌లో అనుకోని విషాదం..

అబుధాబి: క్రికెట్‌ అభిమానులను అలరిస్తోన్న టీ20 ప్రపంచకప్‌లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన పిచ్‌ క్యూరేటర్‌ మోహన్‌ సింగ్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అబుధాబి వేదికగా ఆదివారం జరిగిన న్యూజిలాండ్‌- అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయమే పిచ్‌ను పర్యవేక్షించి గ్రౌండ్‌ సిబ్బందికి సూచనలు అందజేసిన ఆయన ఆతర్వాత తన గదికి వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాత బయటకు రాలేదు. దీంతో అనుమానమొచ్చిన గ్రౌండ్‌ సిబ్బంది ఆయన గదికి వెళ్లి పరిశీలించగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్‌ సింగ్‌ 2004లో దుబాయ్ కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న పంజాబ్‌ క్రికెట్‌ స్టేడియం పిచ్‌ క్యూరేటర్‌ (ట్రైనీ)గా సేవలందించారు.దీంతో పాటు గ్రౌండ్‌ సూపర్‌ వైజర్‌, కోచ్‌, సహాయకుడి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అయితే భారత్‌ సెమీస్‌ అవకాశాలను ప్రభావితం చేసే న్యూజిలాండ్‌- అఫ్గానిస్తాన్‌ కీలకమైన మ్యాచ్‌ కు ముందు ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఆగంతకులు హత్య చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోహన్‌ సింగ్‌ గత కొంత కాలంగా మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని వీటిని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని దుబాయ్ క్రికెట్‌ అధికారులు చెబుతున్నారు.అబుధాబి పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మోహన్ సింగ్ కుటుంబానికి ICC మరియు అబుధాబి క్రికెట్ తమ సంతాపాన్ని తెలియజేసాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com