బయోబబుల్ నిబంధన ఎత్తేయనున్న ఐసీసీ..

- November 14, 2021 , by Maagulf
బయోబబుల్ నిబంధన ఎత్తేయనున్న ఐసీసీ..

కరోనా మహమ్మారి కారణంగా క్రీడా రంగంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. క్రికెట్‌లో కూడా పలు నిబంధనలతో పాటు బయోబబుల్ తప్పని సరి చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నది. ప్రతీ సిరీస్ బయోబబుల్ నీడలో జరుగుతుండటంతో ఆటగాళ్లు శారీరికంగానే కాకుండా మానసికంగా అలసిపోతున్నారు. బయటి ప్రపంచానికి దూరంగా ఒక జైలులో బతుకుతున్నట్లు ఉండటం చాలా మందికి కష్టంగా మారింది. బయోబబుల్ వల్ల మానసిక అనారోగ్యానికి గురయ్యామని చెబుతూ పలువురు ఆటగాళ్లు క్రికెట్‌ ఆడటం మానేశారు. ఐపీఎల్ నుంచి లియామ్ లివింగ్‌స్టోన్.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నారు. వరుసగా బబుల్స్‌లో ఉండటం వల్ల మానసికంగా కుంగిపోతున్నామని వాళ్లు పిర్యాదు చేశారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు కూడా బయోబబుల్ అలసట కారణంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నామని బోర్డుకు చెప్పారు. దీంతో బీసీసీఐ కూడా రొటేషన్ పాలసీని అమలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే రాబోయే న్యూజీలాండ్ సిరీస్ నుంచి పలువురు ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించింది.

పలువురు ఆటగాళ్లు, క్రికెట్ బోర్డుల నుంచి అందిన సూచనలు, పిర్యాదుల అనంతరం బయోబబుల్‌పై కీలక నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ సిద్దమైనట్లు తెలుస్తున్నది. శుక్రవారం దుబాయ్‌లో సమావేశం అయిన ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ బయోబబుల్‌పై కీలక చర్చ చేసింది. చాలా మంది సభ్యులు బయోబబుల్ మోడల్ సరైనది కాదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ పడుతున్న ఇబ్బందులు గమనించింది. అందుకే బయోబబుల్ బదులు మెరుగైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని.. అదే సమయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తున్నది.

ప్రస్తుతం యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. ప్రీమియర్ లీగ్‌లో ఎలాంటి బయోబబుల్ నిబంధన అమలులో లేదు. అయితే లీగ్‌లో భాగమైన ప్రతీ ఒక్కరికీ క్రమం తప్పకుండా టెస్టులు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఎవరైన ఆటగాడు పాజిటివ్ తేలినా అతడికి సన్నిహితంగా ఉండే వారిని ఐసోలేషన్ చేయడం లేదు. కేవలం పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను, సిబ్బందిని మాత్రమే ఐసోలేషన్ పంపుతున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఒక బబుల్‌లో ఉండాల్సిన అవసరం లేకుండా.. ఫ్రీగా బయట తిరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతీ ఆటగాడు కోవిడ్ నిబందనలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల ఏ ఆటగాడికి కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎలాంటి మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉండదు. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి ఐసీసీ అమలు చేస్తుందో మాత్రం ఇంకా తేల్చలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com