వాయుకాలుష్యంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ‘సుప్రీం’ మందలింపు

- November 15, 2021 , by Maagulf
వాయుకాలుష్యంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ‘సుప్రీం’ మందలింపు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో వాయుకాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి మందలించింది. వాయు కాలుష్యానికి దుమ్ము, భారీ వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు వంటివే ప్రధాన కారణాలని సోమవారం స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు కొంతకాలం పాటు మూసివేతకు అవకాశం ఉన్న పరిశ్రమలు, పవర్‌ప్లాంట్ల గురించి రెండు ప్రభుత్వాలు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

వాహనాల కదలికలను సైతం నిలిపివేయాలని సూచించింది. పంట వ్యర్థాలు కాల్చడమే.. ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో కాలుష్యానికి ప్రధాన కారణం కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. పంటవ్యర్థాలు కాల్చడం వల్ల 10శాతం మాత్రమే కాలుష్యం ఏర్పడుతోందని తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వాయు కాలుష్యానికి రవాణా, పరిశ్రమలు, ట్రాఫిక్‌ అని.. తక్షణమే తగిన చర్యలు చేపడితే.. కాలుష్యాన్ని తగ్గించొచ్చని పేర్కొన్నారు. సందర్భంగా పరిశ్రమలు మూసివేయడమే కాకుండా వాహనాలను అడ్డుకోగలరా? అంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. మూసివేయగల పవర్‌ ప్లాంట్ల సమాచారాన్ని అందించాలని కోరింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాధానాలు ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు తాము ఆదేశాలివ్వడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. కేసు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. రేపటిలోగా నిర్మాణ పనులు, అనవసర రవాణా సేవలను నిలిపివేసేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమావేశానికి హాజరుకావాలంటూ పంజాబ్‌, యూపీ, ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. అంతకు ముందు ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడికి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించేందుకు తాము సిద్ధమేనని సుప్రీం కోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ పరిధిలోని మిగతా రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ విధిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com