అబుధాబిలో తొలి ‘డ్రైవర్‌లెస్ టాక్సీ’ ప్రారంభం.. ఇవే ప్రత్యేకతలు

- November 25, 2021 , by Maagulf
అబుధాబిలో తొలి ‘డ్రైవర్‌లెస్ టాక్సీ’ ప్రారంభం.. ఇవే ప్రత్యేకతలు

యూఏఈ: అబుధాబిలో తొలి డ్రైవర్ లెస్ టాక్సీ సర్వీస్ ప్రారంభమైంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్ పోర్ట్ (DMT) ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ (ITC) అబుధాబి స్మార్ట్ సిటీ సమ్మిట్‌లో భాగంగా యాస్ ద్వీపంలో సందర్శకులను ఆకర్షించేందుకు ఈ టాక్సీ సేవలను ప్రారంభించారు. బయానాట్ ఫర్ మ్యాపింగ్, సర్వేయింగ్ సర్వీసెస్ సహకారంతో ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. మిరల్, ITC సమన్వయంతో ఈ డ్రైవర్ లెస్ టాక్సీ సర్వీస్ ను పర్యవేక్షించనున్నారు.

తొలిదశలో ఐదు స్మార్ట్ వాహనాలను ప్రారంభించారు. ఇవి యాస్ ద్వీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రజా సౌకర్యాలను అనుసంధానించే మార్గాల నెట్‌వర్క్ లో ప్రయాణీకుల రవాణా సేవలను అందిస్తాయి. డ్రైవర్ లెస్ టాక్సీ సర్వీస్ పొందాలంటే అన్ని యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉండే "TXAI" యాప్ ద్వారా ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ట్రాఫిక్ సాఫీగా సాగడంతోపాటు యాస్ ద్వీపం వినోదం, వ్యాపారం కొసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో ఇవి సహాయపడతాయి.

DMT ఛైర్మన్ ఫలాహ్ అల్ అహ్బాబీ మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్ట్ రవాణా నెట్‌వర్క్ లో ఖచ్చితమైన డేటా-ఆధారిత కృత్రిమ మేధస్సు పద్ధతులను ఉపయోగించారు. DMT ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ భవిష్యత్ ప్రాణాళికల్లో ఇది ఓ భాగం. అబుదాబి ఎమిరేట్‌లో జీవన నాణ్యతను పెంపొందించడానికి, సమాజానికి సేవ చేసే అన్ని కీలక రంగాలలో స్మార్ట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా జీవించడానికి, పని చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి దోహదం చేస్తుంది. UAE ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఈ డ్రైవర్ లెస్ సర్వీసులు నడుస్తాయి." అని అన్నారు.

ఈ డ్రైవర్ లెస్ టాక్సీ సర్వీసును 4 దశలుగా విభజించారు. వీటిల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు నియంత్రించేందుకు ఓ డ్రైవర్ ఉంటాడు. అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఈ కారులో వినియోగించారు. రోడ్డును క్లియర్ చూసేందుకు అత్యాధునికి కెమెరాలు, సెన్సార్ లు అమర్చారు. ఇవి రోడ్డుపై ఏవైనా వస్తువులను కారు ఢీకొనకుండా చేస్తాయి. మ్యాపింగ్ అల్గారిథమ్‌లు, వాటిలో ఇన్‌స్టాల్ చేయబడిన బహుళ సెన్సార్ల నుండి పొందిన డేటాపై  ఆధారంగా ఇవి రోడ్లపై పరుగులు తీస్తాయి. మోడల్ సెన్సార్లలో రాడార్ లాంటి సాంకేతిక వ్యవస్థలు, స్టీరియోస్కోపిక్ విజన్ సిస్టమ్, GPS, ఆప్టికల్ ఆబ్జెక్ట్ రికగ్నిషన్,  రియల్ టైమ్ పొజిషనింగ్ సిస్టమ్స్ లాంటి ప్రత్యేక భద్రతా ప్రమాణాలు ఈ డ్రైవర్ లెస్ కార్లలో అమర్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com