సామాన్యుడికి మెరుగైన సేవలందించేందుకు అధికారుల్లో నైతిక పరివర్తన అవసరం:ఉపరాష్ట్రపతి
- December 05, 2021_1638704605.jpg)
న్యూఢిల్లీ: అవినీతిని ఎంతమాత్రమూ సహించరాదని, పరిపాలనలో అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత, జవాబుదారీతనం అవలంబించాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి అవినీతి చెద పడితే సామాన్య మానవుడికి తీవ్ర నష్టంగా పరిణమిస్తుందని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం క్రింద సకాలంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కేసుల విషయంలో సత్వర పరిష్కారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో సదుద్దేశంతో క్రియాశీలక చర్యలను చేపడుతున్న అధికారులను నిరుత్సాహ పరచడం కానీ, వేధించడం కానీ చేయకూడదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. “అవినీతికి పాల్పడిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలి కాని విస్తృతప్రజా ప్రయోజనాలరీత్యా ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే అధికారులను నిరుత్సాహపరచకూడదు.” అని ఆయన అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ కేబినెట్ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన ‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్: ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
సమాజంలో నైతిక విలువలు సార్వత్రికంగా పడిపోతున్నాయని, ఈ పరిణామాన్ని అరికట్టేందుకు ‘నైతిక భారతం’ అవతరించడం కోసం విశాల ప్రాతిపదికగా ఒక సామాజిక ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.నిజాయితీ తో పనిచేసే సివిల్ సర్వెంట్లు సాధించిన విజయాలను గౌరవించాలని, వారి వినూత్న చర్యలను, సేవలను గుర్తించాలని ఉపరాష్ట్రపతి ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. దీని వల్ల ప్రతిభావంతంగా పనిచేసే యువ అధికారులకు ఇతోధిక ప్రోత్సాహం లభిస్తుందని, ఇతరులు కూడా ఈ దిశగా వినూత్న కృషి చేసేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. స్థానిక అధికారులు చేస్తున్న ఇలాంటి కీలక సేవలను, ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రోత్సాహం కల్పించే బాధ్యతను మీడియా తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజా జీవనంలో సత్ప్రవర్తనతో వ్యవహరించే విషయంలో అధికారులందరికీ విలువలతో కూడిన శిక్షణ అందించాల్సిన ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, అన్ని శిక్షణా కోర్సుల్లో వృత్తిపరమైన నైతికత అంతర్భాగం కావాలని, రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ (ఎఐర్ సి) చేసిన సిఫారసుల ఆధారంగా సివిల్ సర్వెంట్లకు సమగ్రమైన నైతిక స్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు.
మంచి సంస్థలు, సుపరిపాలన ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, కాలయాపన లేకుండా సకాలంలో ప్రజాసేవలు అందించాలంటే మన సంస్థలను పునర్వ్యవస్థీకరించాలని, నిర్ణయ క్రమంలో అడ్డంకులు లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. సేవలు అందించడంలో మానవ ప్రమేయం తగ్గించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ను అధికంగా ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. దీనివల్ల నాణ్యత పెరగడమే కాక, వివక్షకు, స్వప్రయోజనాలకు ఆస్కారం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల ఆధునిక ఆకాంక్షలకు అనుకూలంగా పరిపాలనా నమూనాలు మారాలని, అధికారిక వ్యవస్థ తేలికగా, పారదర్శకంగా, చురుకుగా పనిచేయడం అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌర కేంద్రిత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశం కోసం పనిచేసే అధికారిక వ్యవస్థకోసం కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ కర్మయోగి’ని ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు.
ఈ పుస్తక రచయిత ప్రభాత్ కుమార్ ను, ప్రచురణ కర్తలు ఐసి సెంటర్ ఫర్ గవర్నెన్స్ ను వెంకయ్యనాయుడు అభినందించారు.పదవీ విరమణ చేసిన సీనియర్ అధికారులు తమ అపార అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని యువ అధికారులతో పంచుకునేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు దోహదం చేసేందుకు ఇలాంటి పుస్తకాలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు.
పుస్తక రచయిత ప్రభాత్ కుమార్, ఐసి సెంటర్ ఫర్ గవర్నెన్స్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ కపూర్, సెక్రటరీ జనరల్ శాంతి నారాయణ్ సహా పలువురు మాజీ సివిల్ సర్వీస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
_1638704546.jpg)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!