ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా? ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

- December 06, 2021 , by Maagulf
ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా? ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ తీసుకున్నారా? ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాలా? ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా?

అయినా మీరు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. ఇందుకోసం మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటే చాలు. మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్ఐసీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. పలు కారణాలతో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చని తెలుసు. ఆస్పత్రి ఖర్చులు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం లాంటి కారణాలతో పీఎఫ్ డబ్బుల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్ఐసీ ప్రీమియం కూడా చెల్లించే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ.

ఈపీఎఫ్ ఖాతాదారులు తాము జమ చేసిన పీఎఫ్ డబ్బుల నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాలనుకుంటే ఫామ్ 14 సబ్మిట్ చేస్తే చాలు. ఫామ్ 14 సబ్మిట్ చేసే సమయంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం రెండేళ్ల ఎల్ఐసీ ప్రీమియంకు సంబంధించిన డబ్బులు ఉండాలి. ఈ డబ్బులతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం మాత్రమే కాదు... కొత్తగా ఎల్ఐసీ పాలసీ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లించకపోవడమే మంచిదంటున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఈపీఎఫ్ఓ ఇచ్చిన ఈ వెసులుబాటు ఓ వరం లాంటిది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సదుపాయం ఉపయోగించుకోవాలనుకుంటే తమ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఎల్ఐసీ పాలసీ లింక్ చేయాలి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి మాత్రమే ఈ సదుపాయం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇతర కుటుంబ సభ్యుల ఎల్ఐసీ పాలసీకి ఇది వర్తించదు. మరి ఈపీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసుకోండి.

ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫామ్ 14 డౌన్‌లోడ్ చేయాలి.
ఫామ్లో ఎల్ఐసీ పాలసీ తీసుకున్న బ్రాంచ్ ఆఫీస్ లేదా యూనిట్ ఆఫీస్ అడ్రస్ రాయాలి.
ప్రీమియం చెల్లించాలంటే పాలసీ నెంబర్, కొత్త పాలసీ అయితే ప్రపోజల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత తేదీ, సమ్ అష్యూర్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
ప్రీమియం చెల్లించాల్సిన తేదీని వెల్లడించాలి.
నామినీ వివరాలు ఎంటర్ చేయాలి.
గతంలో పీఎఫ్ అకౌంట్ నుంచి ఏ ఇన్స్యూరెన్స్ పాలసీ కోసం డబ్బులు విత్‌డ్రా చేయలేదన్న విషయాన్ని ధృవీకరించాలి.
ఈ దరఖాస్తు ఫామ్‌ను ఈపీఎఫ్ కమిషనర్‌కు సబ్మిట్ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com