నేను ఉన్నంతవరకు నువ్వూ ఉండు.. సాయితేజతో బిపిన్ రావత్

- December 10, 2021 , by Maagulf
నేను ఉన్నంతవరకు నువ్వూ ఉండు.. సాయితేజతో బిపిన్ రావత్

ఏపీ: దేశం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన పోరాట యోధులు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదం యావత్ భారతావనిని కలచివేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కొడుకు సాయితేజ ఆర్మీ నేపథ్యం గురించి గుర్తు చేసుకుంటున్నాడు తండ్రి మోహన్. చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ ఆర్మీలో చేరతానంటే ఆందోళన వ్యక్తం చేసినా బిడ్డల ఇష్టాన్ని కాదనలేకపోయాడు మోహన్.. కన్నకొడుకు కళ్లముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ఎదిగావు.. నీతో పాటు తమ్ముడినీ చేర్చావు.. ప్రాణాల మీదకు తెచ్చే ఉద్యోగం మనకొద్దు నాయినా అన్నా విన్నావు కాదు. బిపిన్ రావత్ సార్‌తోనే ఉంటానన్నావు.. నేను ఉన్నంతవరకు నువ్వూ ఉండు సాయి అని ఆయన అన్న మాటలను ఈ విధంగా నిలబెట్టుకున్నావా అని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పారా కమాండోలకు సాయితేజ ఇస్తున్న శిక్షణ చూసి అతడిని తన వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించుకున్నారు రావత్.. సాయితేజను కంటికి రెప్పలా చూసుకునేవారు.. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ రావత్‌తో చెప్పారు. కానీ ఆయన.. నేను ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉండు సాయి అని అనడంతో ఆయన మాటకు విలువిచ్చి ఆర్మీలోనే ఉండిపోయారు సాయితేజ.. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడం అత్యంత విషాదకరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com