భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

- December 10, 2021 , by Maagulf
భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

న్యూ ఢిల్లీ: భారత్‌లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది.దీంతో భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 25కి చేరింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ రెండు పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కాగా.. తాజాగా, ఆయన భార్య, బావమరిదికి కూడా ఈ కొత్త వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయిందని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ విజయ్‌కుమార్ ఖారాడీ వెల్లడించారు. తాజా కేసులతో గుజరాత్‌లో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య మూడుగా నమోదయ్యింది.

వారం రోజుల కిందట జింబాబ్వే నుంచి 72 ఏళ్ల వృద్ధుడు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రాగా ఆయనకు కోవిడ్ నిర్ధారణ కాగా.. జన్యు పరీక్షల్లో ఒమిక్రాన్‌గా తేలింది. ఆ మర్నాడే అతడి భార్యతో పాటు బావమరిదికి నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌ -19 పాజిటివ్‌గా తేలడంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం నమూనాలను గాంధీనగర్‌లోని గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చి సెంటర్‌కు పంపారు. ఇద్దరిలోనూ ఒమిక్రాన్‌ వేరియంట్ నిర్ధారణ అయ్యింది.

దీంతో జామ్‌నగర్‌లోని గురుగోవింద్‌ సింగ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఒమిక్రాన్‌ వార్డులో ముగ్గురుకీ చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వీరిలో కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. దేశంలో తొలిసారి బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీ ఒక్కో కేసు బయటపడింది. ప్రపంచంలో 60 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com