వరంగల్లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న జెన్పాక్ట్

- December 16, 2021 , by Maagulf
వరంగల్లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న జెన్పాక్ట్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్పాక్ట్ ప్రతినిధి బృందం మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన సీఈఓ ఈ మేరకు ప్రకటన చేశారు. 

ఈ సందర్భంగా వరంగల్ నగరానికి జెన్పాక్ట్ కంపెనీని ఆహ్వానించిన మంత్రి కేటీఆర్, ఈ కంపెనీ రాకతో వరంగల్ నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గొప్ప భరోసా లభిస్తుందని అనేక ఉపాధి అవకాశాలు లభించే దిశగా వరంగల్ ఐటి పరిశ్రమ ముందుకు వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే వరంగల్ లో ఉన్న సౌకర్యాలు, మానవ వనరుల వలన అనేక ఐటీ సంస్థలు  ముందుకు వస్తున్నాయని కేటీఆర్, వరంగల్ లాంటి నగరాల్లో తమ పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వరంగల్ నగరం హైదరాబాద్ నుంచి అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉందని, ఉత్తమ విద్యా సంస్థలు వరంగల్ లో ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ టైగర్ త్యాగరాజన్ కు మరియు కంపెనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఎల్-1, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ అనేక కంపెనీల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేట్ లలో సైతం ఐటీ టవర్ ల పనులు పూర్తి కానున్నాయి అని తెలిపారు. వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా, మైండ్ట్రీ, సయంట్ వంటి కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 

ఇప్పటికే తమ కంపెనీ హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న పోచారం క్యాంపస్ కి కేవలం గంటన్నర దూరంలోని వరంగల్ క్యాంపస్ రానున్నదని ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ టైగర్ త్యాగరాజన్ తెలిపారు. తమ కంపెనీ ప్రతినిధి బృందం వరంగల్లో ఐటీ పరిశ్రమకు అనుకూలంగా ఉన్న ఎన్ఐటి వంటి విద్యా సంస్థలతో పాటు అనేక ఇంజనీరింగ్ కాలేజీ లను పరిగణనలోకి తీసుకుందని, వరంగల్ నగరంలోనూ అపారమైన, నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ కంపెనీకి భవిష్యత్తులో వరంగల్ నగరం ఒక కీలకమైన టెక్ సెంటర్ గా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీకి వివిధ దేశాల్లో సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com