సాక్షర భారత్ నిర్మాణానికి పునరంకితమవుదాం: ఉపరాష్ట్రపతి

- December 19, 2021 , by Maagulf
సాక్షర భారత్ నిర్మాణానికి పునరంకితమవుదాం: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: సంపూర్ణ సాక్షరత సాధించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రైవేటు రంగంతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాలు సహకారం అందిస్తూ.. సాక్షర భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వయోజన విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి తదితర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 
 
సంపూర్ణ సాక్షరత సాధించే క్రమంలో డిజిటల్ సాక్షరత, ఆర్థిక సాక్షరతలకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మక నెహ్రూ, ఠాగూర్ సాహిత్య అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యావద్భారతం నుంచి నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమం విజయవంతానికి యువత ముందుకు రావాలని సూచించారు. యువత తమకు సమీపంలో ఉన్న ప్రాంతాలను తరచుగా సందర్శిస్తూ.. అక్కడి వయోజనులకు రాయడం, చదవడం, డిజిటల్ పరికరాల వినియోగం తదితర అంశాలపై తమకున్న జ్ఞానాన్ని పంచేందుకు ప్రయత్నించాలన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లాగే, ప్రతి ఒక్కరూ మరొకరికి చదువు నేర్పించడాన్ని వ్యక్తిగత సామాజిక బాధ్యత (పీఎస్ఆర్)గా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
వయోజన విద్యను ప్రోత్సహించే దిశగా భారత వయోజన విద్య సంఘం (ఐఏఈఏ) చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ‘విద్య ద్వారా సాధికారత లభిస్తుంది. అది ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పును తీసుకొస్తుంది. వారిలో చైతన్యం కలిగించడంతోపాటు వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చేస్తుంది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 
అక్షరాస్యత రేటుకు దేశాల అభివృద్ధికి ప్రత్యక్షమైన సంబంధం ఉంటుందన్న ఉపరాష్ట్రపతి.. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు సక్రమంగా, సమాజంలోని చివరి వ్యక్తికి చేరవేయడంలో అక్షరాస్యత ప్రధానమైన భూమిక పోషిస్తుందన్నారు. 
విద్యతోపాటుగా నైపుణ్యాభివృద్ధి కూడా అత్యంత కీలకమైన అంశమన్న ఉపరాష్ట్రపతి భారతదేశంలోని ప్రజల్లో మరీ ముఖ్యంగా యువతలో ప్రతిభాపాటవాలకు కొదువలేదని, ఆ సామర్థ్యాన్ని గుర్తించి దానికి పదును పెట్టడం ద్వారా సానుకూల మార్పులకు బీజం వేయవచ్చని సూచించారు. 
నిరక్షరాస్యతతోపాటు సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లింగ వివక్ష, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలు, గ్రామీణ-పట్టణాల మధ్య విద్య, వైద్యం, సాంకేతికత సహా వివిధ అంశాల్లో నెలకొన్న అంతరాలు భారత అభివృద్ధికి ప్రధానమైన అవాంతరాలుగా మారుతున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. వీటిని తొలగించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అన్ని భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. 
నూతన జాతీయ విద్యావిధానం – 2020 కూడా వయోజన విద్యతోపాటు వివిధ అంశాల్లో అనుసరించాల్సిన విధివిధాలనాలకు సంబంధించిన ఓ దార్శనిక పత్రమన్న ఉపరాష్ట్రపతి అన్ని రాష్ట్రాలూ ఎన్ఈపీ-2020ని అమలు చేయాలని ఆయన సూచించారు. సరైన విద్యను అందించడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన ‘శిక్షిత్ ఔర్ సమర్థ్ భారత్’ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. 
 
2019, 2020 సంవత్సరాలకు గానూ నెహ్రూ, ఠాగూర్ అక్షరాస్యత అవార్డులను ఉపరాష్ట్రపతి అందజేశారు.2019 సంత్సరానికి గానూ నెహ్రూ అక్షరాస్యత అవార్డును ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రొఫెసర్ పి. ఆదినారాయణ రెడ్డి, ఠాగూర్ అవార్డును ప్రొఫెసర్ అనిత దిఘే అందుకోగా.. 2020 సంవత్సరానికి గానూ నెహ్రూ అవార్డును ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రొఫెసర్ ఎంసీ రెడ్డప్పరెడ్డి, ఠాగూర్ అవార్డును నిశాత్ ఫారూఖ్‌కు ఉపరాష్ట్రపతి అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో ఐఏఈఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్ రాజా, సంస్థ ప్రధాన కార్యదర్శి సురేశ్ ఖండేల్ వాల్,సలహాదారు కేసీ చౌదరితోపాటు వయోజన విద్యాభివృకోసం కృషిచేస్తున్న ప్రముఖులు,అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com