వూపిరి:రివ్యూ

- March 25, 2016 , by Maagulf
వూపిరి:రివ్యూ

వూపిరి   తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, తనికెళ్ల భరణి, అడవి శేష్‌, గాబ్రియేలా, నోరా ఫతేహి, అనుష్క, శ్రియ తదితరులు   సంగీతం: గోపీసుందర్‌,   ఛాయాగ్రహణం:  పి.ఎస్‌.వినోద్‌,   


రచన:
  అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.   నిర్మాణ సంస్థ: పీవీపీ సినిమా   నిర్మాతలు:  పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె   విడుదల:  25 మార్చి, 2016    

 కొన్ని సినిమాలు నటులకి పేరు తీసుకురావొచ్చు. మరికొన్ని సినిమాలు సాంకేతిక నిపుణుల్ని మెచ్చుకొనేలా ఉండొచ్చు. కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల కోసమే అన్నట్టు ఉంటాయి. వాటిని చూసినప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతరత్రా ఏవీ గుర్తుకు రావు. కేవలం ఆ కథ, పాత్రలు మాత్రమే మదిలో మెదులుతుంటాయి. మంచి సినిమాని చూశామనే అనుభూతిని మనసునిండా నింపుతుంటాయి. ఆ కోవకి చెందిన చిత్రమే వూపిరి'. ఎలా ఉందో తెలుసుకొందాం పదండి...   

 కథేంటీ?     విక్రమాదిత్య (నాగార్జున) అపర ధనవంతుడు. ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లు, చేతులు కోల్పోతాడు. అప్పట్నుంచి ఆయన్ని అందరూ జాలితో చూస్తుంటారు. అలా జాలితో కాకుండా... తనని తానుగా చూసే ఓ తోడు కోసం చూస్తుంటాడు విక్రమాదిత్య. అలాంటి ఓ కేర్‌టేకర్‌ని ఎంపిక చేసుకొనే పనిలో ఉంటాడు. అప్పుడే దొంగతనాలు చేస్తూ జైలుకి వెళ్లొచ్చిన శీను (కార్తీ) విక్రమాదిత్యకి కేర్‌టేకర్‌గా పనిచేసేందుకు వెళతాడు. తన అమాయకత్వాన్ని, నిజాయతీని చూసిన విక్రమాదిత్య... ఎంతోమందిని కాదని శీనుని తన కేర్‌టేకర్‌గా ఎంపిక చేసుకొంటాడు. మరి విక్రమాదిత్యని శీను ఎలా చూసుకొన్నాడు? శీనులో తోడుని చూసుకొన్నాడా? లేదా? వాళ్లిద్దరూ ఒకరికొకరు ఏం చేసుకొన్నారు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.   

 ఎలా ఉందంటే?     భావోద్వేగాలే ఈ సినిమాకి... వూపిరి. పెద్దగా కథేమీ ఉండదు కానీ... అందులోని సున్నితమైన భావోద్వేగాలు, వినోదమే ప్రేక్షకుడికి బయటి ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తాయి. సన్నివేశాలు ఉన్నట్టుండి గుండెని బరువెక్కిస్తాయి, కళ్లని తడి చేస్తాయి. అంతలోపే నవ్విస్తూ... గుండెని మళ్లీ తేలిక చేస్తాయి. ప్రతీ సన్నివేశాన్నీ పకడ్బందీగా అల్లుకొన్నాడు దర్శకుడు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టాప్‌ 20 సినిమాల్లో ఒకటైన ఫ్రెంచి చిత్రం ది ఇన్‌టచ్‌బుల్స్‌'కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఫ్రెంచి సంస్కృతి వేరు, మన వాతావరణం వేరు. కానీ ఆ కథని దర్శకుడు మనకి అనుగుణంగా మలుచుకొన్న విధానం ఆకట్టుకుంటుంది. ఆ బంధాలు, భావోద్వేగాలు కూడా ఇదివరకు తెరపై చూడనివేమీ కావు. అయినా సరే... వాటితోనే కొత్తదనాన్ని పంచాడు దర్శకుడు. తెరపై కనిపించే ప్రతి పాత్రకీ ఓ అర్థం ఉంటుంది. శీనుకి తెలియకుండానే తన కుటుంబానికి విక్రమాదిత్య సాయం చేసే విధానం, విక్రమాదిత్యకి తెలియకుండానే ఆయనకి శీను సాయం చేసే విధానం, ఆయన పాత జీవితాన్ని మళ్లీ గుర్తు చేయడం లాంటి    సనివేశాలు చిత్రానికి ప్రధాన బలం. తొలి సగభాగం సినిమా చాలా వేగంగా సాగుతుంది. మలి సగభాగం మొదలయ్యాక మాత్రం ఆ వేగం తగ్గినట్టనిపిస్తుంది. కార్‌ రేసింగ్‌ సన్నివేశాలు అవి మరీ లాగదీసినట్టు అనిపిస్తాయి. అనుష్క తెరపై కనిపించడంతో మళ్లీ భావోద్వేగాలు బలంగా పండాయి. పతాక సన్నివేశాలు తేలిపోయినట్లు అనిపిస్తాయి. అనుష్క, శ్రియలు అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు.   

 ఎవరెలా చేశారంటే?     నాగార్జున వీల్‌ఛెయిర్‌కి పరిమితమవుతూ కనిపించే పాత్రని చేయడం ఓ సాహసమే. కళ్లతోనే ఆయన భావాల్ని పలికించాడు. అయినా ఇలాంటి సాహసాలు చేయడం నాగార్జునకి కొత్తేమీ కాదు. అలాగే కార్తీ కూడా ఇలాంటి మధ్య తరగతి కుర్రాడి పాత్రలు ఇదివరకు చాలానే చేశాడు. ఈ సినిమా విషయంలో నటీనటులకంటే ప్రేక్షకులే అదృష్టవంతులు అనాలి. ఇలాంటి ఒక మంచి సినిమాపై గౌరవంతో నాగార్జున, కార్తీ, ప్రకాష్‌రాజ్‌లు నటించారు. అందుకే సినిమా కథ, ఆ పాత్రలు తప్ప నటీనటులు ప్రేక్షకులకి పెద్దగా గుర్తుకు రారు. తమన్నా కీర్తి అనే అందమైన సెక్రటరీ పాత్రలో ఒదిగిపోయింది. కార్తీకీ, తమన్నాకి మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పండించాయి. సాంకేతికంగా కూడా ఈ సినిమాకి మంచి మార్కులు పడతాయి. పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం, గోపీసుందర్‌ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రిల సాహిత్యం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. అబ్బూరి రవి మాటలు మరో అదనపు బలం. కథకి ఏం అవసరమో అవి సమకూరాయి. పీవీపీ నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.   చివరిగా:   ఈ వూపిరి సరికొత్త అనుభూతినిస్తుంది   

 బలాలు:కథ, కథనం    సంగీతం    నటీనటులు    మాటలు   

 బలహీనతలు:పతాక సన్నివేశాలు   

గమనిక:  ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

 

మాగల్ఫ్ రేటింగ్:3.75

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com