తాలిబన్: షోరూంల్లో బొమ్మల తలలు నరికేస్తున్న వైనం

- January 04, 2022 , by Maagulf
తాలిబన్: షోరూంల్లో బొమ్మల తలలు నరికేస్తున్న వైనం

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం అరాచకాలతో అల్లాడుతోంది.ప్రతి చిన్న విషయాన్ని మతానికి ముడిపెడుతూ ప్రజల ప్రాధమిక హక్కులను హరించి వేస్తున్నారు తాలిబన్లు. రానురాను వీరి విపరీత బుద్ధితో ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అఫ్ఘాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి.. తమ జెండా పాతిన తాలిబన్లు.. ప్రజలపై బలవంతంగా షరియా చట్టాలను రుద్దుతున్నారు.ఇటీవల దేశంలో ఉన్న విగ్రహాలను, ఇతర బొమ్మలను నాశనం చేయాలంటూ తాలిబన్లు హుకుం జారీ చేశారు.చివరికి బట్టల షోరూంల్లో ఉండే బొమ్మలను సైతం నాశనం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

వ్యాపారులు, ప్రజలు స్వచ్చందంగా తమ వద్దనున్న బొమ్మలను నాశనం చేయకుంటే తామే వాటిని దహనం చేస్తామంటూ హెచ్చరించారు. అయితే, వస్త్ర దుకాణాల్లో ఉండే బొమ్మలు చాలా ఖరీదైనవని.. వాటిని నాశనం చేస్తే తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని కొందరు దుకాణదారులు స్థానిక తాలిబన్ నేతలకు విన్నవించుకున్నారు.దీంతో కాస్త కనికరించిన.. అక్కడి స్వయం ప్రకటిత మంత్రి షేక్ అజీజ్-ఉ-రెహమాన్.. బొమ్మల తలలు మాత్రం తొలగించాలని ఆదేశించారు. అదికూడా ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తుందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇస్లాం మతాన్ని ప్రగాఢంగా విశ్వసించే తాలిబన్లు.. షరియా చట్టాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారు. షరియా చట్టాల ప్రకారం విగ్రహారాధన నేరం. బొమ్మలు సైతం విగ్రహాల కోవలోకే వస్తాయని బ్రమిస్తున్న తాలిబన్లు వాటిని నాశనం చేయాలంటూ పిలుపునిచ్చారు. కాగా అఫ్ఘాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన తాలిబన్లు.. తమ దారికిరాని ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో వ్యవసాయం పరిశ్రమలు మూతపడి సగానికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com