తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం
- January 18, 2022
తెలంగాణ: సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ గురుకులాలు మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో, గ్రామ స్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది.
వ్యవసాయం తదితర అనుబంధ రంగాల బలోపేతంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, పల్లెల్లోని తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరగడంతో గ్రామాల్లోనూ ఇంగ్లీష్ మీడియం బోధనకు డిమాండ్ పెరిగిందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య అనివార్యమని మంత్రిమండలి అభిప్రాయపడింది. దీనికోసం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించింది. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని విద్యాశాఖను ఆదేశించింది.
దీంతో పాటు తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రుసుముల నియంత్రణకు చట్టాన్ని తెచ్చేందుకూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆంగ్లమాధ్యమ బోధన, రుసుముల నియంత్రణపై పూర్తి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సభ్యులుగా ఉంటారు. ముసాయిదా చట్ట రూపకల్పన అనంతరం రానున్న శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లులకు చట్టబద్ధత కల్పిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘‘మన ఊరు - మన బడి’’ కార్యక్రమం చేపట్టేందుకు మంత్రిమండలి అనుమతించింది. రాష్ట్రంలో కొత్తగా మహిళా, అటవీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. హైదరాబాద్ కోఠిలోని మహిళా కళాశాల స్థలంలో, సిద్దిపేట జిల్లా ములుగులో వీటి ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ, అటవీ శాఖలు ప్రతిపాదనలు సమర్పించగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







