నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘనంగా నివాళులర్పించిన ఏపీ గవర్నర్

- January 23, 2022 , by Maagulf
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘనంగా నివాళులర్పించిన ఏపీ గవర్నర్

విజయవాడ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఘించదగిన విషయమన్నారు.నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్‌ దివస్‌’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గవర్నర్,  ఇప్పటికీ దేశంలోని అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారన్నారు. బోసు జయంతి సందర్భంగా జరుపుకునే 'పరాక్రమ్ దివస్' దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తుందన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవడానికి 'పరాక్రమ్ దివస్' స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ " మీరు రక్తం చిందించండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను",  "జై హింద్" అన్న నినాదాలతో దేశంలోని యువకులను ప్రేరేపించారన్నారు. మహాత్మా గాంధీని "జాతి పితామహుడు" అని పిలిచిన మొదటి నాయకుడు కూడా ఆయనేనని గవర్నర్ గుర్తు చేసారు. వెలకట్టలేని ఆయన సేవలకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ ప్రజలకు ఎనలేని గర్వకారణమని గవర్నర్ హరిచందన్ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, ఉప కార్యదర్శి సన్యాసిరావు, రాజ్‌భవన్‌ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com