ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు సడలింపు

- January 27, 2022 , by Maagulf
ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు సడలింపు

న్యూ ఢిల్లీ:  ఢిల్లీలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడంతో కోవిడ్ – 19 ఆంక్షలను సడలింపు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022, జనవరి 27వ తేదీ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) సమావేశమైంది. ఈ సమావేశం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలో జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కేసులు తగ్గుతున్న క్రమంలో…వారంతపు కర్ఫ్యూని ప్రభుత్వం ఎత్తివేసింది. సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేయనున్నాయి. దుకాణాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సరి – బేసీ విధానానికి స్వస్తి పలికింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు 200 మంది వరకు అనుమతినిచ్చింది. ఇక పాఠశాలల తెరవడం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిపుణులతో చర్చించాక..డీడీఎంఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. జనవరి 01వ తేదీ నుంచి ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో రోజువారి పాజిటివిటి రేటు 10.59 శాతానికి చేరుకుంది. బుధవారం ఢిల్లీలో 7 వేల 498 కేసులు నమోదు కాగా..29 మంది చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com