మరోసారి తెరపైకి పెగాసస్ వ్యవహారం
- January 29, 2022
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు.దీంతో పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్ తో దానిపై డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ నూ 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్ తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి దానిపై వేడి రాజుకుంది.
‘ద బ్యాటిల్ ఫర్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ ఫుల్ సైబర్ వెపన్’ పేరిట న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. దశాబ్ద కాలం నుంచి ఎన్ఎస్ వో సంస్థ పెగాసస్ ను వివిధ దేశాలకు అమ్ముతోందని ఆరోపించింది. పోలీసులు, నిఘా విభాగాలకు సబ్ స్క్రిప్షన్ పద్ధతుల్లో పెగాసస్ ను అమ్ముతున్నట్టు వెల్లడించింది. ‘‘ప్రపంచంలోని ఏ నిఘా సంస్థ చేయలేని పనిని పెగాసస్ తో చేయవచ్చంటూ వివిధ దేశాల నిఘా సంస్థలకు పెగాసస్ ను అంటగట్టింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఎన్ క్రిప్ట్ చేసిన సమాచారాన్నీ చోరీ చేసేలా దానిని రూపొందించింది’’ అని పేర్కొంది.
2017లో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారని, ఆ దేశ పర్యటనకు వెళ్లిన ప్రధానిగా చరిత్ర సృష్టించారని గుర్తు చేసింది. ఆ పర్యటనలోనే నాటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో 200 కోట్ల డాలర్లతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని చెప్పింది. ఆ ఒప్పందంలో ఓ క్షిపణి వ్యవస్థ, పెగాసస్ లే కీలకమని వ్యాఖ్యానించింది. కొన్ని నెలల తర్వాత నెతన్యాహు భారత పర్యటనకు వెళ్లారని చెప్పింది.
ఆ తర్వాత కొన్నాళ్లకే పాలస్తీనా మానవ హక్కుల సంఘానికి అబ్జర్వర్ (పర్యవేక్షణ) హోదాను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలిలో భారత్ ఓటేసిందని గుర్తు చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా రాలేదు. అధికార వర్గాలు మాత్రం పెగాసస్ అనేది ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేసిన సాఫ్ట్ వేర్ అని, అలాంటప్పుడు ప్రభుత్వంతో ఎలా ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఇలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ లను ప్రభుత్వం కొనుగోలు చేయదన్నారు.
భారత్ లో రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగాసస్ తో నిఘా పెట్టారంటూ గత ఏడాది ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం తాము ఎవరిపైనా నిఘా పెట్టలేదని, దానికి ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది.
దీనిపై విచారణకు గత ఏడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశ భద్రతంటూ ప్రతీసారి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోజాలదని, ఇలాంటి వాటితో నిఘా పెడుతుంటే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది. ఆ తర్వాత రాజకీయంగా అది ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.
వెల్ లోకి దూసుకెళ్లి రాజ్యసభ చైర్మన్ పట్ల ప్రతిపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. దీనికి ఆగ్రహించిన రాజ్యసభ చైర్మన్ .. సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తేయాలంటూ రాహుల్ సహా ఎంపీలంతా సభ బయట ఆందోళన కూడా చేశారు. అయితే, క్షమాపణ చెబితే తప్ప వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసేది లేదంటూ రాజ్యసభ చైర్మన్ కరాఖండిగా చెప్పారు. మళ్లీ ఇప్పుడు సరిగ్గా పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయం ఆసన్నమవుతుండగానే ఈ పెగాసస్ వేడి రాజుకుంది. మరి, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు సజావుగా సాగనిస్తాయా? అన్నదే ప్రశ్న.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!