ఆన్‌లైన్‌లో గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

- February 04, 2022 , by Maagulf
ఆన్‌లైన్‌లో గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్: ఆన్‌లైన్‌ యాప్ ల ద్వారా అక్రమంగా గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా సభ్యులను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షల రూపాయల నగదు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేష్ భగవత్ నిందితుల వివరాలు వెల్లడించారు. తిరుమల్ రెడ్డి జోజి రెడ్డి, అదురీ జోసఫ్ రెడ్డి అనే ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులు.. హైదరాబాద్ కేంద్రంగా..”బెట్365 ” అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు.

ఈక్రమంలో నిందితులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి..ఫంటర్స్ ను ఆకర్షిస్తున్నారు. ట్రూ స్టార్స్, అర్సీ లెజెండ్, అనే పేరులతో హార్స్ బెట్టింగ్ గ్రూప్ లు ఏర్పాటు చేసి.. ఆన్ లైన్ యాప్ ద్వారా ఈరకమైన పందేలు నిర్వహిస్తున్నట్టు సీపీ మహేష్ భగవత్ వివరించారు. వీరిపై నిఘా ఉంచిన ఎల్బీనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 42 లక్షల నగదు, 2 ల్యాప్ టాప్ లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ నిందితుల్లో బొక్క మాధవ రెడ్డి అనే వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బోయినపల్లికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. అనుమతి లేని ఆన్ లైన్ యాప్ ల ద్వారా బెట్టింగ్ లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా రాచకొండ పోలీసులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com