సింగపూర్‌లోని విద్యార్థులకు సంగీతం మరియు నృత్య కోర్సులు

- February 27, 2022 , by Maagulf
సింగపూర్‌లోని విద్యార్థులకు సంగీతం మరియు నృత్య కోర్సులు

సింగపూర్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, భారతదేశం మరియు సింగపూర్‌లోని విద్యా సంగీతం అకాడమీ, కలిసి  సింగపూర్‌లోని విద్యార్థులకు సంగీతం మరియు నృత్య కోర్సులను అందించడానికి కొలాబరేషన్ చేస్తున్నామని ప్రకటించాయి.వైస్ ఛాన్సలర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) అధ్యక్షతన, SPMVV అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన విశ్వవిద్యాలయ అధికారులు మరియు సింగపూర్ లోని తెలుగు, భారతీయ సంగీత వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.రాగవిహారి పేరుతో, విద్యార్థుల ప్రదర్శనలు మరియు సందేశాలతో కూడిన విశిష్ట కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ఘనం గా నిర్వహించబడింది. భారతదేశం, సింగపూర్‌లోని సంగీత ఔత్సాహికులు 2 గంటల కార్యక్రమాన్ని ఆస్వాదించగా,  YouTube మరియు Facebookలో ఎందరో ప్రేక్షకులు, సంగీతకారులు కామెంట్‌ల ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యక్షప్రసారం సమయంలో, విద్యా సంగీతం యొక్క వివిధ డిజిటల్ ఛానెల్‌లలోని 400+ పైగా వీక్షకులు ఈ కార్యక్రమానికి వచ్చారని నిర్వాహకులు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా, SPMVV  వైస్ ఛాన్సలర్ డాక్టర్ జమున దువ్వూరు, SPMVV ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.ఈ కొలాబరేషన్ అదే నిబద్ధతలో ఒక ముఖ్య భాగం అని చెప్పారు. అంతర్జాతీయ సహకారాల విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో ఈ కొలాబరేషన్ ఒక మైలురాయి అని, అలాగే ఆసియా ఖండంలో తమ విశ్వవిద్యాలయమ ద్వారా చేస్తున్న కాలాబోరేషన్స్ లో ఇది మొదటిదని కూడా ఆమె జోడించారు. ఈ విషయం పై మాట్లాడుతూ, SPMVV ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ డాక్టర్ పి విజయలక్ష్మి మరియు SPMVV ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ ద్వారం VJ లక్ష్మి కూడా ఈ కొలాబరేషన్ ప్రత్యేకమైన సింగపూర్ శైలిలో జరుగుతోందని, దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి విద్యా సంగీతం అకాడమీకి వారి సహకారం పూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. .
 
ఈ కార్యక్రమంలో విద్యా సంగీతం అకాడమీ (VSA) వ్యవస్థాపకురాలు, కాపవరపు విద్యాధరి మాట్లాడుతూ, “పలు సంగీత నృత్య కార్యక్రమాలను అందించడానికి సుప్రసిద్ధ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సంగీతం (గాత్రం / వాయిద్యం) మరియు నృత్యం (కూచిపూడి / భరతనాట్యం) అలాగే అన్నమయ్య కీర్తనలు మరియు వాగ్గేయకార వైభవం కోసం సర్టిఫికేట్ కోర్సులు కూడా ఈ ఒప్పందం ద్వారా సింగపూర్ లో పిల్లలకు అందిస్తాము. సింగపూర్‌లో మన సంస్కృతిని ప్రచారం చేసేందుకు VSA చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. SPMVV అధికారులు వారి మద్దతు, సౌలభ్యం మరియు అనేక నెలలపాటు పని చేయడం ద్వారా దీనికి రూపకల్పన చేసినందుకు నేను వారిని అభినందిస్తున్నాను." అన్నారు.
 
ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, చిరకాల సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రెసిడెంట్ రత్నకుమార్ కవుటూరు SPMVV మరియు VSA బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు మరియు ఈ సహకారాన్ని "సింగపూర్‌లోని NRI విద్యార్థులు సంగీతం నేర్చుకునేందుకు మరియు SPMVV వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు పొందేందుకు ఒక గొప్ప అవకాశం" అని వర్ణించారు. మన సంస్కృతి మరియు సంగీతం యొక్క ప్రభావాలను యోగాతో పోల్చుతూ, సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతేశ్వర్ రెడ్డి కురిచేటి ఈ సహకారాన్ని “సంగీతాన్ని ఇష్టపడే పిల్లలందరూ ఆదరించడానికి ఒక ముఖ్యమైన, సంతోషకరమైన సంఘటన” అని పేర్కొన్నారు. భారతదేశం నుండి ప్రముఖ వక్త మరియు గౌరవనీయ వ్యక్తి రంగస్వామి కృష్ణన్, ఇలాంటి సహకారాలు మన దైనందిన జీవితంలో పెరగాలని మరియు సంస్కృతిని వ్యక్తపరచాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బు వి పాలకుర్తి కూడా నిర్వాహకుల కృషిని అభినందించారు.
 
విద్యా సంగీతం అకాడమీ విద్యార్థుల ప్రకటనలు, సందేశాలు మరియు ప్రదర్శనలతో ఒక ప్రత్యేకమైన మిక్స్‌గా  జరిగిన ఈ రెండు గంటల కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీక్షకులచే ప్రశంసించబడింది. సింగపూర్‌లోని విద్యార్థుల కోసం ఎన్‌రోల్‌మెంట్‌లు తెరిచామని  VSA టీం  ధృవీకరించింది. కోర్సు వివరాలు, విచారణలు మరియు రిజిస్ట్రేషన్‌ల కోసం ఆసక్తిగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ http://vidyasangeetam.academy ద్వారా సంప్రదించవలసిందిగా VSA ప్రతినిధి విద్యాధరి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com