యుక్రెయిన్ పై రష్యా మళ్లీ బాంబుల వర్షం..

- April 08, 2022 , by Maagulf
యుక్రెయిన్ పై రష్యా మళ్లీ బాంబుల వర్షం..

యుక్రెయిన్: యుక్రెయిన్ పై రష్యా మళ్లీ బాంబుల వర్షం కురిపించింది.తూర్పు యుక్రెయిన్ ను టార్గెట్ చేసింది. రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులకు పాల్పడింది. శరణార్థులను తరలించే రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడులు చేసింది. దీంతో 30 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలు అయ్యాయి. తూర్పు యుక్రెయిన్ వైపు దళాలను తరలించి రష్యా దాడులకు పాల్పడుతోంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. నెల రోజులకు పైగా యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. యుక్రెయిన్‌ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగిసిపోలేదని అర్థమవుతోంది.

యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. యుక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి.

ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే యుక్రెయిన్ ఆర్మీ పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది. రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18,900 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ ఆర్మీ గురువారం ప్రకటించింది.

దీంతోపాటు 698 యుద్ధ ట్యాంకులు, 1891 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 150 యుద్ధవిమానాలు, 135 హెలికాప్టర్లు, 111 యూఏవీలను నేలకూల్చినట్లు పేర్కొంది. వీటికి అదనంగా 7నౌకలు, 55విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com