క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

- April 20, 2022 , by Maagulf
క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్: కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పార్టీలకు హాజరై విమర్శలు మూటగట్టుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు క్షమాపణలు తెలిపారు. 10 జూన్ 2020లో డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించిన తన బర్త్‌డే పార్టీకి హాజరైనందుకు గాను పోలీసులు ఆయనకు 50 పౌండ్ల జరిమానా విధించారు. ఫలితంగా పదవిలో ఉండగా చట్టాన్ని ఉల్లంఘించిన తొలి బ్రిటన్ ప్రధానిగా ఆయన రికార్డులకెక్కారు. కాగా, కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో అధికార పార్టీ నేతలు పార్టీలు నిర్వహించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం వెలుగులోకి వచ్చాక జాన్సన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై తాజాగా జాన్సన్ మాట్లాడుతూ.. తాను తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించలేదన్నారు. ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో ఆయన మాట్లాడుతూ.. పుట్టిన రోజున కేక్ కట్ చేయడం కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్న విషయం తనకు తోచలేదన్నారు. ఇది చిన్న అతిక్రమణేనని పేర్కొన్న ఆయన పార్టీకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. అయితే, విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని బోరిస్ తేల్చి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com