శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే...

- May 12, 2022 , by Maagulf
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే...

కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులను ఎదర్కొంటోంది.ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి.

ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సేలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహిందా రాజపక్సే. భద్రతా కారణాల వల్ల ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. తాజాగా దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్ట్ నిషేధం విధించింది.

ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు గోటబయ రాజపక్సే వారం రోజుల్లో కొత్త ప్రధాని, మంత్రి మండలిని ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. దీంతో కొత్తగా ఎవరు ప్రధాని పదవి చేపడుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా రణిల్ విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. సంక్షోభ సమయంలో యునైటెడ్ నేషనల్ పార్టీ చీఫ్ గా ఉన్న రణిల్ కు పార్టీలకు అతీతంగా మద్దతు ఉంది. 225 మంది సభ్యులు ఉన్న శ్రీలంక పార్లమెంట్ లో మెజారిటీ మద్దతు రణిల్ విక్రమసింఘేకు లభిస్తుందని భావిస్తున్నారు. విక్రమ సింఘే గురువారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో సమావేశం అయ్యారని లంక మిర్రర్ తెలియజేసింది. 5 సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉన్న విక్రమసింఘేకు శ్రీలంక సంక్షోభాన్ని అరికడతాడనే ప్రజలు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా ప్రభుత్వంలో భాగం కావడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో శ్రీలంకలో కొత్తగా ఐక్యకూటమిగా ప్రభుత్వం ఏర్పడనుంది. ఇప్పటికే అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అఖిల పక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చినప్పటికీ ఆసమయంలో ఎవరూ ముందుకు రాలేదు. కాగా ప్రస్తుతం శ్రీలంకలో దిగజారిన పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com