రాబోయే రోజుల్లో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్

- May 14, 2022 , by Maagulf
రాబోయే రోజుల్లో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని రాబోయే రోజుల్లో దేశంలో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి సుంకిశాల ఇన్టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ సుంకిశాల ఇన్టెక్ వెల్ పంపింగ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకు అనుగుణంగా కృష్ణానది నీటిని నగర వాసులకు అందించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

రూ.1459 కోట్లతో కృష్ణా నీటిని అదనంగా తరలించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని, భవిష్యత్ ఫేజ్ 4,5కి కూడా ఇప్పుడే ప్రణాళికలు వేసినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. వచ్చే 2023 ఎండాకాలం నాటికి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. భారతదేశానికి హైదరాబాద్ ఒక అతిపెద్ద ఆస్తిగా అభివర్ణించిన కేటీఆర్..రాబోయే రోజుల్లో దేశంలో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని అన్నారు. రకరకాల కారణాల వల్ల చాలా నగరాల్లో త్రాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని, కొన్ని నగరాల్లో రైలు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉందని అన్నారు. హైదరాబాద్ జలమండలి ముందు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేసిన ఘటనలు తన చిన్నతనంలో చూశానన్న మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం హైదరాబాద్ లో త్రాగు నీటి ఇబ్బందులు తొలగిపోతున్నాయని అన్నారు.

2022లో అంటే ప్రస్తుతం 37 టీఎంసీల నీరు నగరానికి అవసరం ఉండగా, 2072 నాటికి అది దాదాపు 70.97 టీఎంసీల నీరు నగరానికి అవసరం అవుతుందని అంచనా వేశామని, ఆమేరకు హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అప్పటికి తాము ఉంటామో, ఇంకెవరు ఉంటారో తెలియదుగాని నగరం మాత్రం ఉంటుందని వ్యాఖ్యానించారు. గోదావరి మీద 10 టీఎంసీల కోసం ఒక ప్రాజెక్టు, కొండపోచమ్మ నుంచి కూడా ఒక లైన్ హైదరాబాద్ నగరానికి వేస్తున్నామని కేటీఆర్ వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో తక్కువ టైమ్ లో పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని, ఎవరు ఏమన్నుకున్న దేశంలోనే తక్కువ టైంలో ప్రాజెక్టు పూర్తి చేసిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కుతారని కేటీఆర్ అన్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి..జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందన్న కేటీఆర్..ప్రపంచ నగరంగా హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com