అమ్మానాన్నలు దూరమైనా.. భరతమాత మీ వెంటే ఉంది: మోడీ

- May 30, 2022 , by Maagulf
అమ్మానాన్నలు దూరమైనా.. భరతమాత మీ వెంటే ఉంది: మోడీ

న్యూఢిల్లీ: అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు.. ఆప్యాయత, వాళ్లు లేరనే లోటు పూడ్చలేనిదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అయినా భరత మాత మీ వెంట ఉందంటూ పిల్లలకు భరోసా ఇచ్చారాయన.

కరోనా మహమ్మారితో అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్ట్రన్‌' పథకం అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. సోమవారం పథక ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడుదల చేశారు.

పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉపకార వేతనాలతో పాటు పీఎం కేర్స్‌ పాస్‌ బుక్‌, ఆయుష్మాన్‌ భారత్‌, జన్‌ ఆరోగ్య యోజన హెల్త్‌ కార్డులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు అవసరమయ్యే వైద్య ఖర్చులను కేంద్రమే భరిస్తుంది.

పీఎం కేర్స్‌ ఫండ్‌.. కరోనా టైంలో ఆస్పత్రుల సన్నద్ధత, వెంటిలేటర్ల కొనుగోలు, ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు తోడ్పింది. తద్వారానే ఎన్నో ప్రాణాలు నిలిచాయి. అయినా దురదృష్టవశాత్తూ కొందరిని దేశం కోల్పోయింది. కరోనాతో చనిపోయిన వాళ్ల బిడ్డలకు తోడ్పాటుగా, వాళ్ల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకే పీఎం కేర్స్‌ ఫండ్‌ ఇప్పుడు ఉపయోగపడుతోందని అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

మీ తల్లిదండ్రుల ప్రేమను ఏ ప్రయత్నం భర్తీ చేయకపోవచ్చు. అండగా భరతమాత మీ వెంటే ఉంటుంది. పీఎం కేర్స్ ద్వారా ఈ దేశం మీ ప్రయోజనాలను నెరవేరుస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తో, సంస్థో లేదంటే ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నం మాత్రమే కాదు.. పీఎం కేర్స్‌లో కోట్ల మంది ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com