'విరాట పర్వం'మూవీ రివ్యూ

- June 17, 2022 , by Maagulf
\'విరాట పర్వం\'మూవీ రివ్యూ

నటీనటులు: రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఈశ్వరీ రావు, రాహుల్ రామకృష్ణ, నవీన్ చంద్ర తదితరులు..
దర్శకత్వం: వేణు ఉడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
రిలీజ్ డేట్: జూన్ 17 2022

దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాట పర్వం’. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా కరోనా ఇతర కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు ధియేటర్లో సందడి చేస్తోంది. రీసెంట్ ప్రమోషన్స్ నేపథ్యంలో, సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయ్. మరి, ఆ అంచనాల్ని ‘విరాట పర్వం’ అందుకుందా.? లేదా.?

కథ:
నిమ్న కులానికి చెందిన వెన్నెల (సాయి పల్లవి), కామ్రేడ్ అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన విప్లవ కవిత్వాలకు ప్రేరణ పొంది, అతనిపై విపరీతమైన ప్రేమను పెంచుకుంటుంది. ఆ ప్రేమను దక్కించుకోవడానికి కొన్ని కీలక పరీణామాల నేపథ్యంలో రవన్నని వెతుక్కుంటూ అడవికి చేరుతుంది. నక్సల్స్ దళ నాయకుడైన రవన్నను పట్టుకోవడానికి పోలీసులు విపరీతంగా గాలిస్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో వెన్నెల కూడా దళంలో చేరుతుంది. మరి, వెన్నెల తన ప్రేమను దక్కించుకుందా.? దళంలో చేరిన తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవల్సి వచ్చింది.? చివరికి వెన్నెల జీవితం ఏమైంది.? తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే:
రానా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సినిమా సినిమాకీ నటుడిగా ఎంతో పొటెన్షియాలిటీ చూపిస్తాడు రానా. అలాగే ఈ సినిమాలోనూ దళ నాయకుడిగా..  రానా పర్సనాలిటీ కావచ్చు, పర్‌ఫామెన్స్ కావచ్చు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. తన వంతు పూర్తి న్యాయం చేసేశాడు రానా.
ఇక ఈ సినిమాకి సంబంధించి మరో స్పెషల్ అట్రాక్షన్ సాయి పల్లవి. నిజానికి సాయి పల్లవి వైపు నుంచే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. దాంతో అంచనాలు బాగా పెరిగిపోయాయ్ సినిమా మీద. మరి ఆ అంచనాల్ని వెన్నెల పాత్రతో సాయి పల్లవి అందుకుందా.? అంటే నో డౌట్ ఖచ్చితంగా రీచ్ అయ్యింది సాయి పల్లవి. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో సాయి పల్లవి పరకాయ ప్రవేశం చేస్తుంది. అలాగే, వెన్నెల పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసిన సాయి పల్లవి, రానాతో ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే సన్నివేశాల్లో కానీ, కొన్ని ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్స్‌లో కానీ, ఆమెలోని నటిని నెక్స్‌ట్ లెవల్‌‌కి తీసుకెళ్లింది. నేచురల్ లుక్స్‌తో తన పాత్రకి మరోసారి ప్రాణం పోసింది సాయి పల్లవి. ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ పర్‌ఫామెన్స్ అని చెప్పొచ్చు.
ఇతర పాత్రధారులు నవీన్ చంద్ర, ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా శ్వేతలు, తమకున్న నిడివి మేరకు ఆయా పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా:
యాక్షన్ సీక్వెన్స్‌కి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా మరింత ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. అయితే, నక్సల్స్ నేపథ్యానికి సంబంధించి కొన్ని సీన్లు రిపిటేషన్‌లా అనిపిస్తాయి. ఎడిటర్‌గారు తమ కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి వుంటే, బాగుండునని అనిపిస్తుంది. అలాగే, క్లైమాక్స్ఎపిసోడ్ ఈ సినిమాకి చాలా కీలకం. అక్కడ కూడా డైరెక్టర్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే మరింత బావుండేదనిపిస్తుంది.
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయ్. విజువల్‌గా ఎక్కడా రాజీ పడలేదు. అడవి సీన్లను చాలా నేచురల్‌గా చిత్రీకరించారు. అలాగే యాక్షన్ సీన్లు కూడా ఎక్కడా డ్రమెటిగ్గా అనిపించవు. బొబ్బిలి సురేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ వేణు ఉడుగుల విషయానికి వస్తే, నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి, ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా తీయాలి. అలాగే ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడాలి. అక్కడ వేణు ఉడుగుల పర్‌ఫెక్ట్‌గా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నటీ నటుల నుంచి తనకు కావల్సిన అవుట్ పుట్ రాబట్టడానికి ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్:
రానా, సాయి పల్లవి మెచ్యూర్డ్ పర్ఫామెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:
రిపీటెడ్ సీన్స్
పేలగా సాగిన క్లైమాక్స్

ఫైనల్‌గా:
రానా, సాయి పల్లవి హై ఇంటెన్సివ్ పర్‌ఫామెన్స్ కోసం ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com