విద్వేషభావం భారతీయ సంస్కృతికి పూర్తి వ్యతిరేకం: ఉపరాష్ట్రపతి
- June 17, 2022
న్యూఢిల్లీ: అందరితో ప్రేమగా, కలుపుగోలుగా ఉండటమే భారతీయ సంప్రదాయమని, భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంతమాత్రమూ చోటులేదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమస్యలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవనవిధానమని ఆయన అన్నారు.
కొన్ని విధ్వంసకర శక్తులు భారతదేశంలో అశాంతి రేకెత్తించేందుకు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకుని వాటిని భగ్నం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఈ నిరసన ఆందోళనలను రేకెత్తించే విధంగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంతోనే పురోగతి సాధ్యమవుతుందన్నారు. జాతీయవాదం, దేశభద్రత అంశాల్లో రాజీపడాల్సిన అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశంలో ‘సర్వధర్మ సమభావన’ అక్షరాలా అమలవుతోందని, ఇకపైనా ఇదే విధానంతో మన దేశం ముందుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం తనను కలిసేందుకు వచ్చిన జవహార్ లాల్ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి సంభాషించారు. తెలుగురాష్ట్రాలనుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంత దూరం ఢిల్లీకి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతంతోపాటు దేశానికి కూడా పేరుతీసుకురావాలన్నారు. పుస్తకాల్లోని విజ్ఞానాన్ని పొందడంతోపాటుగా సృజనాత్మకమైన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంపై యువత దృష్టిపెట్టాలన్నారు.
అంకితభావం, క్రమశిక్షణ, కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు. అప్పుడే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలుపడుతుందన్నారు. ప్రకృతిని ప్రేమించాలని, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. పంచభూతాలను కాపాడినపుడే వాటినుంచి మనకు రక్షణ లభిస్తుందని ఆయన సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక సంతులనం సాధ్యమవుతుందన్న ఉపరాష్ట్రపతి ఇందుకోసం ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడంతోపాటుగా యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంతో భాగం చేసుకోవాలన్నారు. ఇందుకోసం వివేకానందుడు చెప్పినట్లుగా క్రీడలపైనా దృష్టిసారించాలన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా యువత కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
మాతృభాషను ప్రోత్సహిస్తూ, దైనందిన జీవితంలో వాడాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆ తర్వాత మరెన్ని ఇతర భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు. తాను రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ భాషల్లో రాజ్యసభ సభ్యులు మాట్లాడేందుకు అనుమతించిన విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు.


తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







