అంబానీ సంచలన నిర్ణయం

- June 28, 2022 , by Maagulf
అంబానీ సంచలన నిర్ణయం

ముంబై: ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో ఛైర్మన్ పదవికి అంబానీ రాజీనామా చేసి , ఆ స్థానంలో ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ ఛైర్మన్‌గా నియమించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​కు ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ముకేశ్.. జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్​మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్​లో వెల్లడించింది. అదేరోజు జరిగిన సమావేశంలో ఆకాశ్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపింది.

ఆకాశ్​.. ఇప్పటివరకు రిలయన్స్​ జియోలో నాన్​-ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా ఉన్నారు. 2014లో జియో బోర్డులో చేరారు.అదేసమయంలో, జియో మేనేజింగ్ డైరెక్టర్​గా పంకజ్ మోహన్ పవార్​ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27నే ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. రిలయన్స్ జియో లో కీలక మార్పులు చోటు చేసుకోవడం కార్పొరేటర్ సెక్టార్లో చర్చనీయాంశమైంది. ఏకంగా ముకేశ్ అంబానీ తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది.

తాజా డైరెక్టర్ల బోర్డ్ తీసుకున్న వివరాలిలా ఉన్నాయి…

(ఎ) వాటాదారుల ఆమోదానికి లోబడి 27 జూన్ 2022 నుండి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాల కాలానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమితులైన రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరి నియామకాలకు ఆమోదం. (బి) వాటాదారుల ఆమోదానికి లోబడి… సోమవారం(27 జూన్) నుండి ప్రారంభమైన ఐదు సంవత్సరాల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి ఆమోదం. (సి) కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ ఎం అంబానీ నియామకానికి ఆమోదం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com