వెల్లూరు ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

- June 29, 2022 , by Maagulf
వెల్లూరు ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
చెన్నై: 21 శతాబ్దపు మార్పులకు అనుగుణంగా, సాంకేతిక ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత, సామర్థ్యాన్ని పెంపొందింపజేయాలని, ఇందులో పాఠశాలలు పోషించాల్సిన పాత్ర కీలకమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు ఈ దిశగా కృషిచేయాలని సూచించారు.
 
వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థల ఆధ్వర్యంలో చెన్నై సమీపంలో ఏర్పాటుచేసిన వెల్లూర్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఉపరాష్ట్రపతి బుధవారం ప్రారంభించారు. చిన్నారుల వికాసంలో వారి బాల్యంలో అందించే విద్య పోషించే పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యావిధానంలో భాగంగా విద్యార్థులు ఎక్కువ సమయం నాలుగు తరగతి గోడల మధ్య గడపడం సరైనది కాదన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతోపాటుగా ప్రకృతి ఒడిలో, సమాజంలోని వివిధ వర్గాలతో అనుసంధానమై పనిచేయడాన్ని, వివిధ కళలు, సంస్కృతులను నేర్చుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
విద్యావిధానంలో మార్పులు జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, ఉత్తమ నైపుణ్యం కలిగిన పాఠశాలు విద్యార్థుల్లో ఎలాంటి అంశాలనైనా అవలీలగా అర్థం చేసుకునే, నేర్చుకునే దిశగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. విద్యార్థులు తమకు తాముగా విషయాలను నేర్చుకునేలా, చురుకుగా స్పందించేలా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సృజనాత్మకంగా ఆలోచించే దిశగా శిక్షణ అందించాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థి చురుకైన భాగస్వామ్యం పుస్తకాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకునే విషయంలో సానుకూల ఫలితాలను కనబరుస్తుందన్న ఆయన, బాల్యం నుంచే సామాజిక పరిస్థితులపై అవగాహన పెంపొందించేందుకు సామాజిక స్పృహ, దేశభక్తిని విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
 
ప్రాచీన భారత విద్యావిధానమైన గురుకుల వ్యవస్థ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థి ప్రవర్తనను, ఆలోచనా విధానాన్ని సరైన మార్గంలో నిలపడం మీదే నాడు గురువులు దృష్టికేంద్రీకరించేవారని అన్నారు. నాటి గురు-శిష్య పరంపరను పునర్వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠ్యప్రణాళికతోపాటు పాఠ్యప్రణాళికేతర కార్యక్రమాలను, వివిధ అంశాలను ఒకేసారి నేర్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలన్నారు. విలువలతో కూడిన, సమగ్రమైన విద్యాను అందించడంపై పాఠశాలలు దృష్టిసారించాలన్న ఆయన, తద్వారా ప్రతివిద్యార్థిలోనూ సానుకూల దృక్పథాన్ని, వారిలో దాగున్న సామర్థ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు వీలుపడుతుందన్నారు. విలువల్లేని విద్య అసలు విద్యే కాదని పేర్కొన్నారు.
 
మాతృభాషలో విద్యావిధానం ఉండటం అత్యంత అవసరమని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, ప్రతి విద్యార్థి తన మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించాలన్నారు. అప్పుడే మన భాషతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించేందుకు వీలుపడుతుందన్నారు. మాతృభాషతోపాటుగా వీలైనన్ని ఎక్కువభాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, అయితే మాతృభాష ద్వారానే పురోగతికి బలమైన పునాదులు పడతాయన్నారు. పాఠశాలల్లో విద్యతోపాటుగా యోగ, శారీరక వ్యాయామ కార్యక్రమాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, శారీరక వ్యాయామ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చదువుతో ఆసక్తి పెరగడంతోపాటు సమగ్రవికాసానికి బాటలు పడతాయన్నారు.ఆరోగ్యకమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు ఏదైనా క్రీడను ఎంచుకుని అందులో రాణించేందుకు కృషిచేయాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి టీఎం అన్బరసన్, వీఐటీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్, చైర్మన్ జీవీ సెల్వమ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ తోపాటుగా అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com