స్పైస్‌జెట్‌కు DGCA నోటీసులు

- July 06, 2022 , by Maagulf
స్పైస్‌జెట్‌కు DGCA నోటీసులు

న్యూ ఢిల్లీ: వరుసగా విమానాలు ప్రమాదాలకు గురవుతుండటం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండటంపై స్పైస్‌జెట్‌ సంస్థపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పైస్‌జెట్‌ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమానాలలో భద్రతా లోపంపై కేంద్ర పౌర విమానయాన శాఖ నోటీసులు జారీ చేసింది.

స్పైస్‌జెట్‌ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత గుజరాత్ నుంచి వెళ్తున్న విమానం విండ్ షీల్డులో పగుళ్లు రావడంతో ఆ విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత కోల్‌కతా నుంచి చైనా వెళ్తున్న మరో కార్గో విమానం కూడా తిరిగి వెనక్కి వచ్చి, కోల్‌కతాలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. వెదర్ రాడార్ పనిచేయకపోవడంతో ఆ విమానం తిరిగొచ్చి ల్యాండ్ అయింది.

ఈ నెల 2న మరో స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు వ్యాపించడంతో, ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల స్పైస్‌జెట్‌ విమానాలకు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఈ సంస్థకు డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి గురవుతున్న విమానాలను, సాంకేతిక సమస్యలను గుర్తించాలంటూ యాజమాన్యాన్ని ఆదేశించింది. ప్రయాణికుల భద్రతే అసలు ప్రాధాన్యమని, చిన్న సమస్య ఉన్నా దాన్ని గుర్తించి, సరి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com