పెద్దలు చూపిన మార్గంలో సమాజం కోసం పనిచేయడమే అసలైన వారసత్వం: ఉపరాష్ట్రపతి

- August 01, 2022 , by Maagulf
పెద్దలు చూపిన మార్గంలో సమాజం కోసం పనిచేయడమే అసలైన వారసత్వం: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: మన పెద్దలు సంపాదించిన ఆస్తిని పంచుకోవడమొక్కటే వారసత్వం కాదని, వారు చూపిన ఆదర్శాలను పాటిస్తూ సమాజసేవను ముందుకు తీసుకెళ్లడమే అసలైన వారసత్వమని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమాజం కోసం పనిచేయడం చాలా ఆనందాన్నిస్తుందని.. దీని ద్వారా కలిగే తృప్తి మరెక్కడా దొరకదని ఆయన అన్నారు.

సోమవారం ఢిల్లీలో రాష్ట్రీయ సేవా సంస్థ (రాస్) కార్యాలయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజసేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన ఎవరైనా సరే సమాజం కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించాలని, మరీ ముఖ్యంగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు దీన్నో బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు.

గ్రామీణాభివృద్ధితో పాటు పట్టణ పేదల సమస్యలకు పరిష్కారం అందించడం, మహిళాసాధికారత, స్త్రీ-శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న సాంకేతిక అంతరాన్ని తగ్గించేదిశగా ప్రభుత్వాలు చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందించాలన్నారు. ఈ విషయంలో రాస్ సంస్థ చేసిన కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు.పి.రాజగోపాల్ నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన రాస్ సంస్థ దిన దిన ప్రవర్థమానమై.. తదనంతరం డాక్టర్ గుత్తా మునిరత్నం నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందన్నారు. 

సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల్లో ప్రత్యేకించి మహిళలు, వ్యవసాయ సంఘాల్ని భాగస్వాముల్ని చేస్తూ, సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు రాస్ చేసిన కృషి ఉన్నతమైనదని ఉపరాష్ర్సపతి పేర్కొన్నారు. సమాజాన్నే తమ కుటుంబంగా భావించి, సమాజసేవలోనే పరిపూర్ణ ఆనందాన్ని పొందే మునిరత్నం నాయుడు గారు తనకెంతో ఆత్మీయులన్నారు. తననెప్పుడు కలిసినా ఆయన మాట్లాడే వంద మాటల్లో 99 మాటలు రాస్ సంస్థ గురించి, సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్న వారి జీవితాల గురించే ఉండేవని ఉపరాష్ర్ఆపతి గుర్తుచేసుకున్నారు. 

మునిరత్నం నాయుడు సేవా దృక్పథాన్ని గౌరవిస్తూ, తన తనయుడు హర్ష ఏర్పాటు చేసిన ‘ముప్పవరపు ఫౌండేషన్’ సామాజిక సేవా విభాగ అవార్డును 2020 జనవరిలో మునిరత్నం నాయుడు గారికి  అందించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. మునిరత్నం నాయుడు గారి చిత్తశుద్ధి, దేశభక్తి, నిరాడంబరత, నిస్వార్థ చింతన ఈతరం యువతకు ఆదర్శనీయమైనవని, గాంధీజీ కలలుగన్న నవభారత నిర్మాణానికి మార్గం చూపించేవని ఆయన పేర్కొన్నారు. 

సేవలో లభించే సంతృప్తి మహోన్నతమైనదని, ఈ సంతృప్తే స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపనకు నాంది పలికింది. తన కుమార్తె  దీపా వెంకట్ సారధ్యంలో గ్రామీణ భారతం, మహిళలు, యువత సాధికారతే ధ్యేయంగా స్వర్ణభారత్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఇదే స్ఫూర్తితో తన కుమారుడైన హర్షవర్ధన్ సైతం ‘ముప్పవరపు ఫౌండేషన్’ ద్వారా స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలకు సహకారం అందిస్తున్నారన్నారు. తన మనుమడు, మనుమరాళ్లు సైతం అదే బాటలో పయనించడం తన సంతోషాన్ని రెట్టింపు చేసిందన్నారు. 

మునిరత్నం నాయుడు పరమపదించిన తర్వాత వారి సేవామార్గాన్ని వారి అల్లుడైన  ఎస్.వెంకటరత్నం కొనసాగిస్తుండటం  అభినందనీయమని, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 4 దశాబ్ధాల పాటు తమ సేవలు అందించిన రాస్ సంస్థ ఇప్పుడు దేశ రాజధానికి సైతం కార్యకలాపాలు విస్తరించడం ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఢిల్లీలో రాస్ సంస్థ ఏర్పాటు కోసం మునిరత్నం నాయుడు ఎంతో తపించారని, వారి కల నేటికి సాకారం అయ్యిందన్నారు. అయితే ఇంతటి ప్రత్యేకమైన రోజు వారు మన మధ్యలేకపోవడం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రాస్ అందించిన సేవల గురించి తెలిసి ఎంతో సంతోషించానన్న ఉపరాష్ట్రపతి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి స్ఫూర్తినే అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు. చేయాలనే మనసుంటే సేవకు హద్దులు, అడ్డు గోడలు ఉండవని, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, సేవా కార్యక్రమాల విస్తృతి పెరగాలే తప్ప తగ్గకూడదన్నది తన అభిలాషని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాస్ ఉపాధ్యక్షులు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం సహా రాస్ నిర్వహణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com