సౌదీలో కార్మిక చట్టాల ఉల్లంఘన.. కార్యాలయం సీజ్

- August 06, 2022 , by Maagulf
సౌదీలో కార్మిక చట్టాల ఉల్లంఘన.. కార్యాలయం సీజ్

రియాద్: రియాద్‌కు ఉత్తరాన ముగ్గురు అరబ్ జాతీయులు అక్రమంగా నిర్వహిస్తున్న వాణిజ్య కార్యాలయాన్ని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు సీజ్ చేశారు. వీరు అనేక రెసిడెన్సీ, కార్మిక చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కార్యాలయ నిర్వహణలో వృత్తిరీత్యా డ్రైవర్లు అయినా ముగ్గురు ప్రవాసులు కీలకంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రియాద్ ప్రాంతంలోని మంత్రిత్వ శాఖ శాఖకు చెందిన ఫీల్డ్ టీమ్‌లు వాణిజ్య కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా అనేక ఉల్లంఘనలను గుర్తించింది. చట్టవిరుద్ధంగా మార్కెటింగ్, గృహ కార్మికుల సేవలను బదిలీ చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం వంటివి ఉన్నాయి. తనిఖీ సమయంలో కార్యాలయంలో వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది గృహ కార్మికులు ఉన్నారు. కార్యాలయం నుంచి ఐదు పాస్‌పోర్టులను కూడా  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తుల అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానిత కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను మంత్రిత్వ శాఖ అధికారులు సేకరించారు. సౌదీ కార్మిక చట్టంలోని నిబంధనలకు అన్ని సంస్థలు, యజమానులు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ మరోసారి గుర్తు చేసింది. ఏవైనా ఉల్లంఘనలు గుర్తిస్తే మంత్రిత్వ శాఖ అప్లికేషన్ ద్వారా లేదా యూనిఫైడ్ నంబర్ 19911కి కాల్ చేయడం ద్వారా తెలపాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com