విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ

- August 20, 2022 , by Maagulf
విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ

అమరావతి: విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టు ఆవరణలో జస్టిస్ రమణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమానికి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సిజెఐ రమణ, సిఎం జగన్‌లు కలిసి మొక్కలు నాటారు. 29 విశాలమైన ఏసీ కోర్టుల హాళ్లు, ఏడు లిఫ్టులు, న్యాయవాదులకు, కక్షిదారులకు వెయిటింగ్‌ హాళ్లు, క్యాంటీన్‌ సహా అన్ని సదుపాయాలతో నూతన కోర్టు భవనాలు అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.100 కోట్లతో దీన్ని నిర్మించారు. ఏడంతస్తులు కలిగిన ఈ భవనంలో 29 కోర్టులు కొలువుదీరనున్నాయి. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన సివిల్‌ కోర్టుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, ఇరుకుగా ఉండటం తదితర కారణాలతో నూతన భవనాల సముదాయాన్ని నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి.రమణ వీటికి శంకుస్థాపన చేశారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుండి గన్నవరం విమానాశ్రయానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ దంపతులు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌. వి.రమణ దంపతులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుండి రోడ్డు మార్గంగా విజయవాడకు సీజే దంపతులు బయలుదేరారు. ఇక విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్‌ తదితరులు పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com