రాజ్‌భవన్‌లో క్రీడాకారులను సత్కరించిన ఏపీ గవర్నర్

- September 07, 2022 , by Maagulf
రాజ్‌భవన్‌లో క్రీడాకారులను సత్కరించిన ఏపీ గవర్నర్

విజయవాడ: అంతర్జాతీయ స్దాయిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రాణించటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కామన్వెల్త్ క్రీడలు-2022, ఆర్చరీ ప్రపంచకప్, ప్రపంచ క్రీడలు-2022లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో బంగారు పతకం సాధించిన పి.వి. సింధు, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో  పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను గవర్నర్ జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఆర్చరీ వరల్డ్ కప్ 2022 వ్యక్తిగత ఈవెంట్‌లో రజత పతకం, 2022 ఆర్చరీ వరల్డ్ కప్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం పొందిన జ్యోతి సురేఖను మెమెంటో, శాలువాతో గౌరవించారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులకు గవర్నర్ హరిచందన్ అభినందనలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశం యావత్తు మిమ్ములను చూసి గర్విస్తుందని భవిష్యత్తులో దేశానికి మరెన్నో అవార్డులు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, యువజన వ్యవహారాలు, పర్యాటక, సంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ వాణీ మోహన్ , క్రీడా ప్రాధికార సంస్ధ ఉపాధ్యక్షుడు, ఎండి ప్రభాకర్ రెడ్డి, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌, క్రీడాకారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com