3వ ‘వందే భారత్ రైలు’ ప్రారంభించిన ప్రధాని మోదీ

- September 30, 2022 , by Maagulf
3వ ‘వందే భారత్ రైలు’ ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్: దేశంలో మూడవ వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక వసతులతో, దేశంలోని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ‘వందే భారత్‌’ రైళ్లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. న్యూఢిల్లీ-వారణాసీ, న్యూఢిల్లీ-వైష్ణోదేవి కత్రా మధ్య వాటి సేవలు అందుతున్నాయి. ఇవాళ మరో వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తుంది. ఈ రైలు ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నడుస్తుంది. ఈ వందే భారత్ ట్రైన్-20901 ముంబై సెంట్రల్ వద్ద ఉదయం 6.10కి బయలుదేరి గాంధీ నగర్ కు మధ్యాహ్నం 12.30కి చేరుకుంటుంది. అలాగే, రిటర్న్ ట్రైన్-20902 గాంధీ నగర్ నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 2.05కు బయలుదేరి, ముంబై సెంట్రల్ కు రాత్రి 8.35కు చేరుకుంటుంది. ఈ ట్రైనులో 16 కోచులు ఉంటాయని, 1,128 మంది ప్రయాణికులు ఇందులో కూర్చోవచ్చని అధికారులు తెలిపారు.

గాంధీనగర్‌ నుంచి ముంబై మధ్య ఉండే సూరత్, వడోదర, అహ్మదాబాద్ (మూడు స్టేషన్లలో)లో మాత్రమే ఈ ట్రైను ఆగుతుందని వివరించారు. దేశంలోని రైలు ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన, మెరుగైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. కాగా, దేశంలో 400 కొత్త తర వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని మూడేళ్లలో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా, తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. వీటి కోసం రైల్వే శాఖకు రూ.1,40,367.13 కోట్లు కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com